29.7 C
Munich
Wednesday, August 5, 2026

బీబీపేటలో కనుమరుగైన తమలపాకు తోటలు.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కలకత్తా వరకు వెళ్లిన తమలపాకు తోటల వైభవం
నైజాం కాలం నాటి సాగునీటి సంపదకు నిదర్శనం
నాలుగు కిలోమీటర్ల చెరువు కట్ట
ఐదు తూముల ద్వారా అనేక గ్రామాలకు సాగునీరు
నిర్లక్ష్యంతో కనుమరుగైన తమలపాకు తోటలు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

కామారెడ్డి జిల్లా బిబిపేట గ్రామం ఒకప్పుడు నైజాం పాలనలో వ్యవసాయ సంపదకు, సాగునీటి వనరులకు చిరునామాగా నిలిచిందని గ్రామ పెద్దలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా బిబిపేట చెరువు కింద విస్తారంగా ఉన్న తమలపాకు తోటలు రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచడంతో పాటు అక్కడి నుంచి కలకత్తా వరకు తమలపాకులను లారీల్లో, డీసీఎంలలో తరలించేవారని చెబుతున్నారు. అందుకే ఆ ప్రాంతంలో పండిన తమలపాకులను “కలకత్తా తమలపాకు”గా పిలిచేవారని స్థానికులు పేర్కొంటున్నారు. సుమారు మూడు దశాబ్దాల క్రితం వరకు చెరువు కింద ఐదు నుంచి పదమూడు ఎకరాల మేర తమలపాకు తోటలు ఉండేవని, వాటితో పాటు ఇతర వాణిజ్య పంటలు కూడా సమృద్ధిగా సాగు చేసేవారని గ్రామ పెద్దలు తెలిపారు. అయితే కాలక్రమేణా ఆ తోటలు పూర్తిగా కనుమరుగైపోయాయని, ప్రస్తుతం ఆ వైభవం ఆనవాళ్లు మాత్రమే మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చరిత్ర కలిగిన బిబిపేట చెరువు నైజాం కాలంలో నిర్మించబడినదిగా చెబుతున్నారు. సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవైన చెరువు కట్ట నేటికీ ఉన్నప్పటికీ, దానికి తగిన మరమ్మతులు జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో నిర్మించిన నిర్మాణాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈ చెరువు నిండితే బిబిపేటతో పాటు తుల్జాపూర్, మల్కాపూర్, ఈసానగర్, ఉప్పరపల్లి, నస్కంటి రాంపూర్ తదితర గ్రామాలకు ఐదు తూముల ద్వారా సాగునీరు అందేదని పెద్దలు గుర్తు చేస్తున్నారు. ఆ నీటితో వేల ఎకరాల్లో పంటలు సాగు చేసేవారని, నీటి కాలువల ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందేదని చెబుతున్నారు.

అప్పటి రోజుల్లో బోరు బావులు లేకుండానే చెరువు నీటిపైనే రైతులు ఆధారపడి వ్యవసాయం చేసేవారని, అక్కడక్కడా ఉన్న కొద్ది బావులే నీటి అవసరాలను తీర్చేవని తెలిపారు. ప్రస్తుతం భూగర్భ జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిబిపేటకు సాగునీటి పరంగా మాత్రమే కాకుండా చారిత్రకంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉందని స్థానికులు చెబుతున్నారు. నైజాం కాలంలో నిర్మించబడిన పురాతన పోలీస్ స్టేషన్ బిబిపేటలోనే ఉండేదని, అనంతరం కామారెడ్డి, దోమకొండ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పటికీ బిబిపేట చారిత్రక ప్రాధాన్యతను ఇప్పటికీ పెద్దలు గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు.

ఈ సందర్బంగ బీబీపేట మండల వాసి కొరివి నరసింహులు మాట్లాడుతూ బిబిపేట చెరువు, తమలపాకు తోటలు, పురాతన పోలీస్ స్టేషన్ వంటి చారిత్రక వారసత్వ సంపదను ప్రభుత్వం పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చెరువును ఆధునీకరించి, సాగునీటి వ్యవస్థను పునరుద్ధరిస్తే మళ్లీ ఈ ప్రాంతం వ్యవసాయ పరంగా పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశముందని నరసింహులు అభిప్రాయపడుతున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.