ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన
సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10వ తేదీన మందమర్రి పట్టణంలో నిర్వహించనున్న ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మందమర్రి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహించే జైల్ భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కార్మిక వర్గం స్వాతంత్ర్యానికి ముందే పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం నాలుగు నూతన కార్మిక కోడ్‌ల ద్వారా బలహీనపరిచిందని రంజిత్ కుమార్ ఆరోపించారు. ఈ చర్యలు కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడానికే ఉద్దేశించినవని, కార్మికుల ప్రజాస్వామ్య హక్కులను హరించే ప్రయత్నమని విమర్శించారు. వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల జీరో సుంకాలతో విదేశీ దిగుమతులు పెరిగి, దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2005లో యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్షాల పోరాట ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆ పథకం పేరును మార్చడమే కాకుండా, రాష్ట్రాలపై అధిక ఆర్థిక భారం మోపుతూ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర విధానాలకు అనుగుణంగా కార్మికులకు ప్రతికూలంగా 10 గంటల పని విధానానికి సంబంధించిన జీవో తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఆగస్టు 10న మందమర్రిలో జరిగే జైల్ భరో కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల రాజలింగు, నాయకులు సాంబారి వెంకటస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి సాంబారి వెంకటస్వామి, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

