అభిమానుల సమావేశంలో వ్యాఖ్యలతో ఊహాగానాలు
సామాజిక సేవలో ముందుండాలని అభిమానులకు పిలుపు
రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం భారతీయ రాజకీయాల్లో కొత్త విషయం కాదు. దక్షిణాది సినీ దిగ్గజాలు ఎన్టీఆర్, ఎంజీఆర్ తమ సినీ జీవితంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రులుగా చరిత్ర సృష్టించారు. ఇటీవల కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కూడా తన రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలోకి దిగడంతో తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, దర్శకుడు ధనుష్ కూడా రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయితే దీనిపై ధనుష్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇటీవల నిర్వహించిన ఓ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ధనుష్ అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. “అభిమాన సంఘాలు కేవలం సినిమా వేడుకలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలి. రక్తదాన శిబిరాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలి” అని ఆయన సూచించారు. ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యల అనంతరం ఆయన అభిమాన సంఘాలను మరింత బలోపేతం చేస్తున్నారని, భవిష్యత్తులో రాజకీయాల వైపు అడుగులు వేయడానికి ఇది సంకేతమా అనే చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ ఊహాగానాలేనని, రాజకీయ ప్రవేశంపై ధనుష్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా, ఆయన రాజకీయ అరంగేట్రంపై అభిమానులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

