కాలం నిర్ణయిస్తే సిద్ధిపేట నుంచే పోటీ చేస్తా
కేసీఆర్ దూరం పెట్టిన వారికి దగ్గరవుతున్న కవిత
80 % జాగృతి పదవులు బలహీన వర్గాలకే
MLC Kavitha : వెంకటేష్ హీరో గా నటించిన సినిమా ” అబ్బాయి గారు ” అందులో జయచిత్ర అత్త, మీన కోడలుగా నటించారు. ఆ సినిమాలో అత్తను ఎప్పటికప్పుడు వాయిస్తూనే ఉంటుంది మీన. అప్పుడు బ్రహ్మనందం అంటాడు. కంచు అండి. కంచు….నంబర్ వన్ కంచు అంటాడు. అప్పుడు అత్తకు మండిపోతుంది. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో కూడా కవిత…. కవితే… కంచు… కంచె అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్, బలయ్ కార్యక్రమంలో కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ కార్యక్రమంలో కేసీఆర్ కు బిన్నంగా కవిత కనిపించారు. ఏ వర్గాలను అయితే కేసీఆర్ పక్కకు పెట్టారో, ఆ వర్గాలను ఆమె కలుపుకొని పోతున్నారు. విమలక్క వంటి అభ్యుదయవాదులను, బహుజనులను, తెలంగాణ ఉద్యమ కారులను కలుస్తున్నారు. మద్దతు కోరుతున్నారు. అంతే కాదు ఉద్యమ సమయంలో కేసీఆర్ కు అండగా నిలిచి, ఇప్పుడు దూరమైన కవులు, కళాకారులు, గాయకులను, మేధావులను, రాజకీయ విశ్లేషకులను కలుపుకుంటున్నారు.
ఏపీ షర్మిల అనడానికి వీలులేదు. కవిత, కవితే అనే విధంగా తయారవుతున్నారు. రోజు, రోజుకు ఆమెలో రాజకీయ మార్పులు కనబడు తున్నాయి. ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడే ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నారు. సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ నుంచి ఆమెను పార్టీ తొలగించింది. అదే సింగరేణిలో హెచ్ఎంఎస్ యూనియన్ కు గౌరవ అధ్యక్షురాలిగా భాద్యతలు చేపట్టడం ఒక తార్కాణం.
బతుకమ్మ తోనే రాజకీయ అడుగులు వేగమందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పురుడు పోసుకున్నచింతమడకలో బతుకమ్మ ఆడి రాజకీయంగా తనకున్న బలమేమిటో రుజువు చేసింది. జాగృతి కార్యవర్గాన్ని విస్తరించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా గిరిజనుడికి భాద్యతలు అప్పగించారు. 80 శాతం పదవులను బలహీన వర్గాలకు కేటాయించారు. కాలం నిర్ణయిస్తే సిద్దపేట నుంచే పోటీ చేస్తా కావచ్చు అన్నారు. అంటే హరీష్ రావు లక్ష్యముగా ఆమె పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది.
సొంతంగా పార్టీ పెట్టడమా ? ఇతరులతో పొత్తు పెట్టుకోవడమా ? అనేది ఇప్పుడే స్పష్టం కాదు. పార్టీ స్థాపించి నెగ్గడం కూడా రాబోయే రోజుల్లో అంత సులభం కాదు. కానీ పార్టీ నుంచి వెళ్లగొడితే తలనొప్పి పోతుందని భావించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అమృతాంజన్ కొనుక్కునే విధంగా కవితనే తయారైనదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.

by