Telangana : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. 7 డిసెంబర్,2023న తెలంగాణలో తన యాత్ర మొదలైనది. ప్రమాణ స్వీకారం చేపట్టిన కొద్దీ నెలల నుంచే నిందలు మొదలైనాయి. మూడు నెలలు అంటూ ఒకరు. కాదు వచ్చే నెలలోనే అంటూ మరొకరు, కాదు, కాదు ఆరునెలలు తిరగక ముందే అంటూ మరొకరు ఇలా పదవి నుంచి దిగిపోవడం ఖాయ మంటూ కొందరు రాజకీయ నిరుద్యోగులు నోటికి పని చెప్పారు. అధిష్టానం రేవంత్ రెడ్డిని దగ్గరకు కూడా రానీయడం లేదంటూ మరో పుకారు. వీటన్నిటిని ఆయన గడ్డిపోచను తీసివేసినట్టుగా తీసేసి ఎదుటి వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రెండేళ్ల యాత్రను పూర్తి చేశారు.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో కొన్నింటిని మినహాయిస్తే, మరికొన్నిటిని అమలు చేశారు. అధికారం చేపట్టిన వెంటనే ఉచిత బస్సు అమలు చేశారు. రెండువందల యూనిట్ల విద్యుత్, గ్యాస్ సిలిండర్ హామీని నెరవేర్చారు. రెండు లక్షల రుణమాఫీ మాత్రం ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. ఆ పథకం విఫలం కావడానికి కారణం కూడ సీఎం కె తెలియాలంటున్నారు రాజకీయ శ్రేణులు. పదేళ్లుగా రేషన్ కార్డుకు నోచుకోని వారికి అందజేశారు. తద్వారా తెల్లకార్డు లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలకు అర్హులైనారు. సన్నబియ్యం అమలు చేశారు. సన్నవడ్లు దిగుబడి చేస్తున్న రైతులకు క్వింటాలుకు ఐదు వందల రూపాయలు అందజేస్తున్నారు.
ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందుతున్నాయి. గతంలో రుణాలు తీసుకున్న ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రాకపోవడంతో సిబిల్ స్కోర్ కోసం అప్పులు చేసి రుణాలు చెల్లించుకున్నారు. కోర్టుకు వెళ్లకుండానే ఉద్యోగాల భర్తీ. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. కీలకమైన పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు రూ : 1500, తులం బంగారం వంటి హామీలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమలుకు నోచుకోలేదనే అభిప్రాయం ఉంది.
రెండేళ్ల రాజకీయ ప్రయాణంలో రేవంత్ రెడ్డి విజయమే సాధించారు. రెండు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేశారు. దింతో కాంగ్రెస్ పార్టీకి జంటనగరాల్లో సీఎం ఊపిరి పోశారు. ఈ రెండు స్థానాలు పోగొట్టుకొని బిఆర్ఎస్ చతికిలపడిపోయింది. కంటోన్మెంట్ స్థానంలో డిపాజిట్ కూడా బిఆర్ఎస్ దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద తన రాజకీయ మేధాశక్తి ఏమిటో నిరూపించుకున్నారు. మోదీతో డీ కొట్టకుండా, దగ్గరవుతున్నారు. రాష్ట్ర అవసరాలను తీర్చుకుంటున్నారు.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అభివృద్ధికి ఆటంకాలు తప్పడంలేదు. గత పదేళ్ల పరిపాలనలో మిగులు కంటే అప్పులే ఎక్కువైనాయి. రాష్ట్ర అభివృద్ధి కి అనేక ప్రణాళికలు తయారు చేసుకున్నారు. గడిచిన రెండేళ్లలో మూసీ సుందరీకరణ, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ, మెట్రో, తదితర పథకాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కానీ వీటన్నిటికీ ఆర్థిక మూలాలను సిద్ధం చేసుకోలేదు. వీటన్నిటికి నిధులు ఎలా సిద్ధం చేసుకోవాలో అనేది ఆయన మదిలో ఉండేఉంటది. గడిచిన రెండేళ్ల పాలన కంటే మరింత మెరుగయిన పరిపాలనను ప్రజలకు అందించినప్పుడే ఆయనకు మరో ఐదేళ్ల పరిపాలన పగ్గాలు చేతికందుతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
———————————-

పొలిటికల్ బ్యూరో
కొమ్మెర అనిల్ కుమార్
9603982983
——————————–

by