Jubilee Hills : జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రానేలేదు. కానీ గాంధీ భవన్ చుట్టూ అప్పుడే ప్రదక్షణలు చేస్తున్నారు కొందరు నాయకులు. పార్టీ టికెట్ దక్కించుకోడానికి పెద్ద యుద్ధమే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. టికెట్ నాకే అంటే, నాకే అంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. ఏకంగా బి ఫారం దక్కించుకోడానికి ఆరుగురు నాయకులు ఎవరికీ వారే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పార్టీ ఎవరిని బరిలో దించాలనే ఆలోచనకు ఇంకా రానేలేదు. పార్టీ నిర్ణయం తీసుకోనేలేదు. టికెట్ నాదే అంటూ ప్రకటనలు చేయడం క్యాడర్ లో ఆసక్తిగా మారింది. బహిరంగంగా టికెట్ కోసం మాట్లాడుతున్నవారిని రాష్ట్ర పెద్దలు మందలిస్తున్నారు కూడా. ఉప ఎన్నిక డిసెంబర్ లో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆరుగురు టికెట్ కోసం కుస్తీ పడుతున్నారు…..
తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు అజారుద్దీన్ టికెట్ నాదేనంటూ తనకు తానూ ప్రకటింపజేసుకున్నారు. విజయం నాదేనంటూ స్వీట్లు కూడా పంచేసారు. అజారుద్దీన్ గత ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ పై ఓటమిచెందారు. ఇదే స్తానం కోసం ఫిరోజ్ ఖాన్ కూడా ఆశపడుతున్నారు. నాంపల్లి నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సీఎం తో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని ఆసరా చేసుకొని టికెట్ తనకే ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు.
పి జనార్దన్ రెడ్డి కూతురు విజయా రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈమె గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెందారు. ఇదే స్తానం నుంచి గెలిచిన దానం నాగేందర్ ఇప్పుడు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. అక్కడ ఆమెకు భవిష్యత్తులో అవకాశాలు లేవు. ఇప్పుడు ఆమె ఇదే స్థానంను ఆశిస్తున్నారు.
బీసీ సామజిక వర్గం నుంచి పార్టీ సీనియర్ నాయకుడు నవీన్ యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. అదే విదంగా మాజీ మేయర్ బొంతు రాంమోహన్, ఆయన భార్య శ్రీ దేవి ఇద్దరిలో ఒకరికి టికెట్ కావాలంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి కి అత్యంత సన్నిహితుడని పేరున్న పార్టీ మైనార్టీ నాయకుడు వాహీమ్ ఖురేషీ కూడా జూబ్లీ హిల్స్ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా ఆరుగురు నాయకులు టికెట్ నాదే అంటే, నాదే అంటూ బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. విజయం దేవుడెరుగు. టికెట్ వచ్చినట్టే ప్రచారం చేసుకోవడం విశేషం.