Congress : కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు ఆయన. అనేక పదవులను అనుభవించారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అయన గులాబీ కండువా కప్పుకున్నారు. చివరకు పుట్టింటికి చేరుకున్నారు. ఆయనే మాజీ రాజ్య సభ సభ్యుడు కె కేశవ రావు. కాకలు తీరిన రాజకీయ నాయకుడు ఆయన. ఇంతకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టా ? లేనట్టా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.
కేశవరావు కు కేబినెట్ హోదా కల్పించి మమ అనిపించారు పుట్టింటివారు. గులాబీ పార్టీలో ఉన్నంత ప్రాధాన్యత ఇక్కడ కనబడుట లేదనే ప్రచారం కూడా కొనసాగుతోంది. కేవలం తన కుమార్తె మేయర్ పదవిని కాపాడుకోడానికే పార్టీ కండువా మార్చుకున్నట్టు అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభకు ముందస్తుగానే రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం కేవలం తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసమే అంటున్నారు రాజకీయ శ్రేణులు.
బిఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు కేశవరావు అధినేతకు నమ్మకస్తుడిగా ఉన్నారు. మ్యానిఫేస్టో కమిటీ లో ప్రధాన బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు కూడా కేసీఆర్ కేశవరావు ను సంప్రదించేవారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా బాధ్యతల్లో ఉంచారు. జీహెచ్‌ఎంసీ మేయర్ గా కుమార్తె విజయలక్ష్మి నే కేసీఆర్ నియమించారు. ఇంత ప్రాధాన్యత దక్కిన కేశవరావు అధికారం పోయిన వెంటనే పుట్టింటికి రావడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. బిఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు ఆయన మీడియా ముందు ఎక్కువగా కనబడేవారు. అంతే కాదు కేసీఆర్ ఎక్కడ ఉంటె ఆయన పక్కనే కేశవరావు ఉండేవారు. పార్టీ మారడానికి చెప్పాల్సిన ప్రధాన కారణాలు ఎంత వెతికినా లేవు. కేవలం కూతురు రాజకీయ భవిష్యత్తు కోసమే కండువా మార్చుకున్నారని చెప్పక తప్పదంటున్నారు రాజకీయ వర్గాలు.
రాజ్యసభ పదవిని త్యాగం చేసి కాంగ్రెస్ లో చేరినందుకు ప్రభుత్వ సలహాదారుగా ఆయన్ని ప్రభుత్వం నియమించింది. ఈ పదవి కేబినెట్ పదవితో సమానం. రాజీనామా చేసిన రెండు రోజులకే ఈ పదవి రావడం విశేషం. కుమార్తె పదవి కోసమే పార్టీ మారి కోరిక తీర్చుకున్నాడనే పేరు వచ్చింది. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కానీ, బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కానీ మీడియా ముందు కనబడేవారు. ఆ ప్రాధాన్యత ఇప్పుడు వెదికినా కనబడుట లేదు. ఇటీవల కేసీఆర్ ను పొగడుతూ కేశవరావు మాట్లాడిన మాటలు ఎక్కడికి దారితీస్తాయోననే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.