Singareni : 2023- 2024 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల వాటాను సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఇవ్వాలని మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘం సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభాత్ మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ లాభాల వాటా పంపిణి చేయాలని యాజమాన్యాన్ని కోరారు.
లాభాల వాటా పంపిణి విషయంలో గత పాలకులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల్ని మోసం చేశారు. దింతో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు వారికి తగిన గుణపాఠం చెప్పారని ప్రభాత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలల్లో భాగంగా సొంతింటి పథకం, ఆదాయపు పన్ను, కార్మికుల పేరు మార్పిడి, కొత్త గనుల నిర్మాణం చేపట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభాత్ అధికార పార్టీని డిమాండ్ చేశారు.
సింగరేణిలో ఐదు జాతీయ సంఘాలు కలిసి పైరవీలకు పాల్పడి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పక్కకుపెట్టి యాజమాన్యంకు సహకరిస్తున్నారని ప్రభాత్ తన లేఖలో ఆరోపించారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల విద్రోహ ఫలితంగా పర్మినెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు తమ న్యాయమైన హక్కులను పొందలేకపోతున్నారని ప్రభాత్ ఆరోపించారు.