Srisylam : ఉగాది పండుగ పురస్కరించుకొని శ్రీశైలంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. అమ్మవారిని కన్నడ భక్తులు తమ ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు. భక్తితో అమ్మవారికి కన్నడ భక్తులు చీరె, సారె చెల్లించి తమ భక్తిని చాటుకుంటారు. ఈ నేపథ్యంలో ఉగాది పండుగ సందర్బంగా ముందస్తుగానే కన్నడ భక్తులు నల్లమల్ల అడవుల బాట పట్టారు. కర్ణాటక రాష్ట్రము నుంచి శ్రీశైలం రావాలంటే నల్లమల్ల అడవుల నుంచే రావాలి. నల్లమల్ల దారులన్నీ కన్నడ భక్తులతో నిండిపోయాయి.
పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు మార్చి 27 నుంచి 31 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మల్లికార్జునస్వామిని దర్శించుకొని, తమ మొక్కులు తీర్చుకోడానికి నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాది తరలివస్తున్నారు. ఓంకారనాదం నల్లమల్ల అడవుల్లో మిన్నంటుతోంది. కుటుంబం అంతా కలిసి కాలిబాటలో శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు.
భక్తులు సుమారుగా 40 కిలోమీటర్లు నడిస్తేగాని మల్లికార్జున స్వామిని చేరుకోలేరు. కాలి నడకన వస్తున్న భక్తులకు దేవస్థానం ఈవో శ్రీనివాస రావు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషం. తాగునీరు, వైద్యం, అన్నదానం ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులో ఉంచారు ఈఓ శ్రీనివాస రావు.