Vamapaksa Party : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తోందని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. మతం పేరుతో రాజకీయం చేయడంతో దేశంలో కులం ,మతం, ప్రాంతాల మద్య అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాద విద్వేష శక్తుల నుండి తెలంగాణ ను రక్షించుకొని, కార్మికుల ఐక్యతను బలోపేతం చేద్దామని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. గోదావరిఖనిలో వామ పక్ష పార్టీల ఆధ్వర్యంలో మతోన్మాద వ్యతిరేక సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సదస్సుకు హాజరైన వామ పక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి
సిపిఐ.జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, సీపీఐ (ఎం ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు నంది రామయ్య, సీపీఐ (ఎం ఎల్) న్యూ డెమక్రసీ రాష్ట్ర నాయకులు కే రాజన్న, సిపిఐ (ఎం ఎల్) రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్ లు మాట్లాడారు. దేశంలోని పలు ప్రాంతాల్లో మహిళలు, దళితులు, ఆదివాసీల పై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలను చైతన్యం చేయడానికి మతసామరాస్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ముందుకు సాగాలని వారు ఈ సందర్బంగా ప్రజలను కోరారు. ప్రజా సమస్యలు, పౌర హక్కులు, లౌకిక ప్రజాస్వామ్యం, సామరస్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం, నిరంకుశ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మతోన్మాదం రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని వారు ఈ సందర్బంగ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్, బిజెపి అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు వారు పిలుపునిచ్చారు.
ఈ సదస్సుకు జిల్లా వామ పక్ష పార్టీల నాయకులు కే కనకరాజు, ఎం మహేశ్వరి, జూపాక శ్రీనివాస్, ఈ నరేష్, ఈ రామకృష్ణ లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. కార్యక్రమంలో గౌతమ్, గోవర్ధన్, వేల్పుల కుమారస్వామి, ఐ కృష్ణ, రమేష్, గుండేటి మల్లేశం, మోహన్, బి అశోక్, ఉపేందర్, చంద్రశేఖర్, మేరుగు చంద్రయ్య, గుమ్మడి వెంకన్నతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.