kousik reddi : దేశ రాజకీయాలను సైతం శాసిస్తామని కలలుగన్న గులాబీ బాస్ కేసీఆర్ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చారు. ముచ్చటగా మూడోసారి కూడా తెలంగాణలో అధికారం చేపడుతామని స్పష్టం చేశారు. అధినేత మాటలతో బరిలో నిలిచిన నాయకులు సైతం సంబరపడ్డారు. తెలంగాణలో గెలిచిన మేము దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తామని కూడా ప్రగల్బాలు పలికారు. ఏముంది అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు . అసెంబ్లీ దిక్కులేదు. పార్లమెంట్ ఎన్నికలకు అయితే కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా కనబడలేదు. ఇంతలోనే కవిత జైలుకు వెళ్లడంతో మరో దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన కొందరు నాయకులు ఉపాధి బాట పడుతున్నారు.
జరగరానిది జరిగింది. పార్టీ అధికారం కోల్పోయింది. నష్టం ఎదుర్కోవాల్సిందే. కష్టం భరించాల్సిందే . అనుకోని కష్టం ఎదురైన నేపథ్యంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తుఫాన్ సృష్టించారు. ఇప్పుడు ఆ తుఫాన్ కాస్త మరింత బలోపేతం అయ్యింది. మరికొద్ది రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల వేల కౌశిక్ రెడ్డి గోల పార్టీ కి తలనొప్పిగా మారింది. రాజకీయంగా ఎవరు ఏది మాట్లాడుతారో,, ఆ విషయాన్నీ తమకు అనుకూలంగా మలచుకొని లబ్ది పొందడానికి మరో పార్టీ కాచుకొని చూస్తుంది.
ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. కౌశిక్ రెడ్డి అరికిపూడి గాంధీ కి విసిరిన బాణం గురి తప్పింది. తిరిగి పార్టీకి ఎదురు తగిలింది. ఇప్పుడు పార్టీకి అయిన గాయానికి ఏ మందు పెట్టాలో అని అధినేత ఆలోచనలో పడినట్టు సమాచారం. సెటిలర్లు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా గ్రేటర్ నుంచే బిఆర్ఎస్ కు ఉన్నారు. కౌశిక్ మాటలతో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో తమ పరిధిలో కార్పొరేటర్లను గెలిపించుకోడానికి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు సైతం పార్టీ శ్రేణుల్లో వ్యక్తం కావడం విశేషం.
కౌశిక్ రెడ్డి ఆవేశంలో నోరు జారినప్పటికీ జరగాల్సిన నష్టం పార్టీకి జరిగింది. సరిదిద్దుకున్నారు. అయినా ఈ విషయాన్నీ కాంగ్రెస్ ఎంత వాడుకోవలెనో అంత వాడేసుకుంటుంది. జరిగిన నష్టాన్ని భరించినప్పటికీ, గ్రేటర్ ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఏమేరకు అండగా నిలుస్తారో అనేది అనుమానమే. అధినేత నోరు మెదపడం లేదు. కేటీఆర్, హరీష్ రావు లు మాత్రమే స్పందిస్తున్నారు. అయినా గ్రేటర్ సెటిలర్లు మాత్రం అసహనంతోనే ఉన్నట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.