Home » BJP : బీజేపీ లో అభ్యర్థుల ఎంపిక వాళ్ళ చేతుల్లోనే ?

BJP : బీజేపీ లో అభ్యర్థుల ఎంపిక వాళ్ళ చేతుల్లోనే ?

BJP : ఎన్నికల పండుగ వచ్చిందంటే కొందరు ఎమ్మెల్యేగా, మరికొందరు ఎంపీగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రాష్ట్రము నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు టికెట్ దక్కించుకోడానికి ప్రదక్షిణలు చేస్తారు.ఇప్పుడు అటువంటి సూత్రాలకు భారతీయ జనతా పార్టీ చెక్ పెట్టేసింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కొత్త నిబంధనలు అమలు చేయడానికి నిర్ణయం తీసుకుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచే వారిని ఎంపిక చేయడానికి కొత్త సూత్రాలను అమలు చేయబోతున్నట్టుగా తెలిసింది. పైరవీలకు అవకాశం ఇవ్వకుండా గెలుపు గుర్రాలనే ఎంపిక చేయడానికి కొత్త పద్దతులతో ముందుకు వెళ్ళడానికి సిద్దమయ్యింది.

బీజేపీ ఇప్పటివరకు సర్వేల పేరిట అభ్యర్థులను ఎంపిక చేసింది. సంఘ్ పరివార్ సూచించిన వారికి కూడా టికెట్ కట్టబెట్టింది. రాష్ట్రంలోని పెద్ద మనుషుల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కూడా టికెట్ ఖరారు అయిన సందర్భాలు ఉన్నవి. పలు నియోజకవర్గాల్లో స్థానికేతరులు కూడా పోటీ చేసిన సందర్భాలు ఉండటంతో అభ్యర్థులు పరాజయం పాలైన సందర్భాలు ఉన్నవి. ఇలాంటి నిర్ణయాల వలన పార్టీ నష్టపోయిన సందర్భాలు అనేకం. అదేవిదంగా అప్పటికప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చి కండువా కప్పుకున్న వారికి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. కొన్నేళ్లుగా పార్టీ జెండా మోసిన వారికి కాకుండా, ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వడంతో ఆ నియోజక వర్గాల్లో పార్టీ ఎంతో నష్టపోయింది. కార్యకర్తల సూచనలు పట్టించుకోకపోవడంతో పార్టీ తగిన మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో కార్యకర్తల అంతర్గత ఎన్నికల సూత్రాన్ని అమలు చేయడానికి కాషాయం ఢిల్లీ పెద్దలు ముందుకు వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం.

ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అభ్యర్థులను ఎంపిక చేయడానికి ముందుగా రాష్ట్ర స్థాయిలో సమావేశమై అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకునేవారు. నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసుకున్న వారి బలం ఆధారంగా జల్లెడ పట్టేవారు రాష్ట్ర పెద్దలు. ఆ తరువాత పార్టీ నియమించిన ఎన్నికల కమిటీ మరోసారి వడపోసేది. ఆ విదంగా వడపోయగా వచ్చిన వారి నివేదికను ఢిల్లీ పంపడం జరిగేది. ఢిల్లీలో మరోసారి అభర్ధుల ఎంపిక పై కుస్తీ పట్టిన తరువాత టికెట్ ఖరారు జరిగేది.

ఈ నేపథ్యంలో ఇకనుంచి వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ముందుగా దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యర్థుల దరఖాస్తులను నియోజకవర్గంలోని కార్యకర్తలకు అందజేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారికి కార్యకర్తలు ఓటివేసి ఎంపిక చేస్తారు. ఓటింగ్ పద్దతిలో తొలి మూడు స్థానాల్లో మెజార్టీ సాధించిన వారి పేర్లను జాతీయ కమిటీకి రాష్ట్ర నాయకత్వం అందజేస్తుంది. ఆ ముగ్గురి లో ఆర్థిక, అంగ బలం ఉన్నవారిలో ఒకరిని ఎంపిక చేసి పోటీ చేయడానికి టికెట్ ఖరారు చేయడంతో అభ్యర్థుల ఎంపిక ఘట్టం ముగుస్తుంది. ఈ కొత్త సూత్రంతో కమలం పెద్దలు ముందుకు వస్తున్నారు. ఇది ఏ మేరకు ఫలించనుందో వేచి చూడాల్సిందే.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *