MLA Ticket : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా తగ్గనేలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ఇంకా పరిపాలన పట్టాలెక్కనేలేదు. ఓడిపోయిన వారు కోలుకోలేదు. వాళ్ళంతా కూడా ఇంకా ఇంటికే పరిమితం అయ్యారు. గెలిచిన నాయకులు మంత్రి పదవి, పార్టీ పదవి, కార్పొరేషన్ పదవి కోసం ఆశతో ఎదురుచూస్తునారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగేళ్ళ సమయం ఉంది. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం మంచిర్యాల జిల్లాలో ఎన్నికల వాతావరణాన్ని ఒక కాంగ్రెస్ నాయకుడు అప్పుడే సృష్టించడం విశేషం.
మంచిర్యాల జిల్లాల్లోని ఒక ఎమ్మెల్యేకు ఆ నాయకుడు నమ్మిన బంటుగా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ పది మంది కలిస్తే ఆ నాయకుడి పేరే వినబడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యే అనుచరుడిగా ముద్రపడింది. జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఇప్పుడు ఆయన చుట్టూ ప్రదక్షణలు చేయడం విశేషం. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కొందరు ఆ నాయకుడి పేరే పలుకుతున్నారు. సమస్యలు కూడా ఆ నాయకుడి ఇంటికే వెలుతున్నాయంటే పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ధి రోజుల్లోనే ఆయన పేరు, ప్రతిష్టలు ఎంత దూరం వెళ్ళాయో చెప్పాల్సిన పనిలేదు.
ఇంత పలుకుబడి, పేరు ప్రతిష్టలు అతి తక్కువ కాలంలోనే రావడంతో ఆ నాయకుడి మనసులో ఒక విచిత్రమైన కోరిక పుట్టింది. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవులు లేవు. అయినా నా పేరు మారుమోగిపోతోంది. ఒకవేళ ఎమ్మెల్యే అయితే నా పేరు అసెంబ్లీ దాకా వెళుతుంది కదా ?. అయితే ఎమ్మెల్యే కావాల్సిందే. ఎమ్మెల్యేగా గెలవాలన్న, పార్టీ టికెట్ రావాలన్నా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అంటే డబ్బు కూడా అవసరం. రాబోయే నాలుగేళ్లలో ఖర్చులకు సరిపడేంత డబ్బు కావాలి. ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు కావాలి. అంటే కనీసం వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించాలి. అప్పుడే పార్టీ టికెట్ నాదే అవుతుంది. ఎమ్మెల్యే నేనే అవుతాను అంటూ ఆ నాయకుడు తన అనుచరుల వద్ద తన మనసులోని కోరికను బయట పెట్టడం విశేషం. ఇప్పుడు ఆ నాయకుడి కోరిక అక్కడ, ఇక్కడ అనకుండా ఎక్కడ పడితే అక్కడ మంచిర్యాల జిల్లాలో చెవులు కొరుకుతోంది.