Yadadri : యాదగిరి నరసింహస్వామి కొండ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి గాంచింది. భక్తులు కూడా తండోప తండాలుగా తరలి వస్తున్నారు. తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. నరసింహ స్వామి ప్రాంతాన్ని పరిశుభ్రముగా ఉంచడానికి ఆలయం అధికారులు ఇటీవలనే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఆలయం అభివృద్ధి తో పాటు భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకొంది.
నరసింహస్వామి కొండపై జ్వాలా నరసింహుడు, గండ భేరుండ నరసింహుడు, యోగ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు స్వయంభువులుగా వెలసి పంచ నరసింహక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది ఆలయం. 2016లో ఆలయాన్ని శాస్త్ర ప్రకారం పునర్నిర్మించి భక్తులకు మరింత సౌకర్యముగా తీర్చిదిద్దారు.
తెలంగాణాలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాదగిరి నరసింహ స్వామి ఆలయంలో గతంలో ఉన్న ఆచారాలను తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. కొండపైననే స్వామి సన్నిధిలో భక్తులకు బసచేసేవిదంగా సౌకర్యం ఏర్పాటు చేయడం, కొబ్బరి కాయలు కొట్టడం, మొక్కిన మొక్కులు తీర్చుకోవడం, కొండ పైకి ఆటోలు వెళ్లడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
గుడికి వెళ్లిన వారు గుడి చుట్టూ కనీసం మూడు ప్రదక్షణలు చేయడం సాంప్రదాయం. ప్రదక్షణలు చేసిన తరువాతనే ఆలయం లోనికి వెళ్లి దర్శనం చేసుకుంటాం. దానినే గిరిప్రదర్శన అంటాం. గిరిప్రదర్శన అనగానే భక్తులకు గుర్తుకు వచ్చేది అరుణాచలం దేవస్థానం. ఆ దేవస్థానం చుట్టూ గిరిప్రదక్షణ చేయాలంటే 14 కిలో మీటర్లు నడవాలి. యాదాద్రి నరసింహ స్వామి ఆలయాన్ని పునరుద్దరించక ముందు గిరిప్రదక్షణ చేసుకొని స్వామి వారిని దర్శనం చేసుకోవడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. ఇప్పడు యాదాద్రి ఆలయానికి కూడా గత వైభవాన్ని తీసుకు రావడానికి గిరిప్రదక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు ఐదు కిలోమీటర్లు గిరిప్రదక్షణ ఉండే అవకాశం ఉంది.