Ex Mavoist Arest : మాజీ మావోయిస్టు నాయకుడు మహమ్మద్ హుస్సేన్ @ సుధాకర్ @ రమాకాంత్ ను అరెస్ట్ చేసినట్టు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు నెలల నుంచి మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, సికాస పునర్నిర్మాణం కొరకు మావోయిస్టుపార్టీ సానుబుతి పరులు కోల్ బెల్ట్ ఏరియాలో కరపత్రాలు విడుదల చేస్తున్నారని సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వచ్చిన సమాచారం మేరకు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సికాస పునర్నిర్మాణం కోసం మందమర్రి , రామకృష్ణాపూర్ ఏరియాలల్లో సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో అప్రమత్తం కావడం జరిగిందన్నారు.
అందులో భాగంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్సై జి రాజశేఖర్ లు సంయుక్తంగా సిబ్బందితో కలిసి మందమర్రి, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. మందమర్రి, రామకృష్ణాపూర్ రహదారిపై పెట్రోలింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఒకరు నల్లటి బ్యాగ్ తో కనిపించాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పట్టుకోవడం జరిగిందని సీపీ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. అతని బ్యాగ్ ను తనిఖీ చేయగా మావోయిస్టుపార్టీ డాక్యుమెంట్స్ , వాల్ పోస్టర్స్, కరపత్రాలు బ్యాగులో కనిపించినవి. విషయం తెలిసిన వెంటనే బెల్లంపల్లి ఏసీపీ అతన్ని సంఘటన స్థలంలో విచారించగా తన పేరు మహ్మద్ హుస్సేన్ @ సుధాకర్ @ రమాకాంత్ మాజీ మావోయిస్టును అని, నేను జమ్మికుంటలో ఉంటానని చెప్పినాడు . పంచనామ నిర్వహించీ అతని బ్యాగులో ఉన్న మావోయిస్టుపార్టీ డాక్యుమెంట్స్ , మావోయిస్టు వాల్ పోస్టర్స్ , కరపత్రాలు మరియు సెల్ ఫోన్ అతని వద్ద నుండి సీజ్ చేసి ,అతన్ని కస్టడీకి తీసుకోవడం జరిగిందని సీపీ వివరించారు.
పట్టుబడిన మహ్మద్ హుస్సేన్ @ సుధాకర్ @ రమాకాంత్ జమ్మికుంట నివాసస్థుడు.1978 నుండి 1981 వరకు KK-2 మైన్ జనరల్ మాజ్దూర్ గా పనిచేసి మావోయిస్టు భావజాలాలకి ఆకర్షితుడై సింగరేణి ఉద్యోగానికి రాజీనామా చేసి మావోయిస్టు పార్టీలో చేరాడు. వివిధ హోదాలలో పనిచేస్తూ ఉత్తర తెలంగాణ కమిటీ మెంబర్ గా ఎదిగాడు. ఇతను సికాస వ్యవస్థాపక సభ్యుడిగా సి. కా. స సి ఓ గా పనిచేశాడు ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లో సుమారు 28 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి. పలుమార్లు జైలుకు వెళ్లినాడు. చివరిసారిగా 2009లో ఝార్ఖండ్ రాష్ట్రంలో బొకారో జిల్లాలో అరెస్టై 2013 వరకు జైలు జీవితం గడిపి బయటకు వచ్చినాడు.
ఇతనికి మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ చంద్రన్న మరియు బండి ప్రకాష్ @ ప్రబాత్ లు డబ్బులు పంపించి కోల్బెల్ట్ ఏరియాలో సి కాసా పునర్నిర్మాణానికి కృషి చేయవలసిందిగా ఆదేశించినారు. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరం నవంబర్ లో క్యాతనపల్లికి చెందిన గురజాల రవీందర్ ఇంటిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యడు వారణాసి సుబ్రహ్మణ్యంతోపాటు వారణాసి విజయలక్ష్మి మరికొంత మంది తో సమావేశమైనాడు. ఆ సమావేశంలో చేసిన తీర్మాణాలకు అనుగుణంగా మహ్మద్ హుస్సేన్ కోల్ బెల్ట్ ఏరియాలో సి కా స పునర్నిర్మాణానికి ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడని సీపీ శ్రీనివాస్ రెడ్డి వివరించారు.