By elections : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. గులాబీ శ్రేణులు నిరుద్యోగులైనారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన బిఆర్ఎస్ నాయకులు కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ బి ఫారం పై గెలిచిన వారు మరో పార్టీ తీర్థం పుచ్చుకోవడం అక్రమం అంటూ బిఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్ట్ స్పందించి స్పీకర్ నాలుగువారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ తీర్పు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు పడితే రాష్ట్రంలో ఉప ఎన్నిక రావడం ఖాయం అవుతుంది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో పాటు బిఆర్ఎస్ కూడా మరోసారి ప్రజల తీర్పు కు వెళ్లక తప్పదు. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నిక ఎవరికి లాభం అవుతుంది ? ఉప ఎన్నికల బరిలో నిలిచిన నేపథ్యంలో బిఆర్ఎస్ నష్టపోవడం ఖాయమనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కానీ ఆ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అత్యధిక స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. కొన్ని స్థానాల్లో మూడో స్థానానికే సరిపెట్టుకుంది. అదేవిదంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా సాధించనన్ని స్థానాలు సాధించింది కాషాయం పార్టీ . ఈ గణాంకాల ప్రకారం అయితే ఉప ఎన్నికల్లో కమలం మరింత వికసించడం ఖాయమనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఎలాగూ అన్ని స్థానాల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారినే బరిలో దించుతుంది. అధికారం ఉంది. ఆర్థిక ఇబ్బందులు లేవు. పార్లమెంట్ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే ఉప ఎన్నిక పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం కావడం విశేషం. ఎందుకంటే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు గెలిచినా, ఓడినా పార్టీకి వచ్చే నష్టం ఏమి ఉండదు. ప్రభుత్వం నడవడానికి పార్టీకి సరిపడేంత బలం ఉంది. ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న శక్తులన్నిటిని ఉపయోగించడం మాత్రం ఖాయం.
ఉప ఎన్నిక జరిగే స్థానాలకు బిఆర్ఎస్ నేత బలమైన అభ్యర్థులను వెతుక్కోవాలి. ఆర్థిక బలం, అంగ బలం ఉన్నవారు తప్పనిసరి. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల కోసం అధినేత జల్లెడ పట్టారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు అధినేత మాటను కాదనలేక బరిలో దిగారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో కూడా గులాబీ నాయకులు, కార్యకర్తలు కూడా కండువా మార్చు కున్నారు. ఇప్పడు ఎన్నికలకు వెళితే గులాబీ జెండా మోసే వారు కూడా కరువైనారు. రాబోయేది స్థానిక ఎన్నికల కాలం. కాబట్టి ఉప ఎన్నికలు జరిగే నియోజక వర్గాల్లో ఆర్థిక బలంతో అధినేత కేసీఆర్ ముందుకు వెళ్లినప్పటికీ అభ్యర్థులు కరువే, పార్టీ జెండా మోసే వారు కూడా కరువే అవుతారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవు తున్నాయి. కాబట్టి మరోసారి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బిఆర్ఎస్ శ్రేణులు రుచి చూడటం ఖాయమనే అభిప్రాయాలను సైతం రాజకీయ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు