Singareni : సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు ఒక్క రోజులోనే నిర్వహిస్తుంది కార్మిక శాఖ. అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. సింగరేణి లో ఏరియాల వారిగా ప్రాతినిధ్య సంఘంగా ఎవరు విజయం సాధించారు ? కార్మిక గుర్తింపు సంఘం గా ఎవరు గెలిచారు ? అనేది కూడా ఎన్నికలు నిర్వహించిన రోజే ప్రకటిస్తారు ఎన్నికల నిర్వహణ అధికారులు. ఫలితాలు ప్రకటించిన రోజే గెలిచిన సంఘాలకు దృవీకరణ పత్రాలను అందజేయాలి. కానీ ఎలాంటి కారణం ఉండదు. ఎవరు కూడా కోర్ట్ కు వెళ్లిన సందర్భం కూడా లేదు. అయినా గుర్తింపు హోదా కు సంభందించిన సర్టిఫికెట్ ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యంకు కానీ, ఎన్నికలు నిర్వహించిన సంబంధిత అధికారులకు కానీ మనసు అంగీకరించకపోవడం శోచనీయం.
ఎట్టకేలకు హైద్రాబాద్ లో సోమవారం సింగరేణి సి అండ్ ఎండి బలరాం చేతుల మీదుగా గుర్తింపు హోదా సరిఫికేట్ ను ఏఐటీయూసీ నాయకులు ఎనిమిది నెలల తరువాత పొందడం విశేషం. గుర్తింపు హోదా పదవీ కాలం రెండు సంవత్సరాలు మాత్రమే. అందులో ఎనిమిది నెలల పుణ్య కాలం గడిచి పోయింది. ఇంకా మిగిలింది పదహారు నెలలు మాత్రమే. మిగిలిన కాలంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్మికుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించడానికి సాధ్యమవుతుందా అనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
గుర్తింపు పత్రం అందుకున్న అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు మాట్లాడుతూ గుర్తింపు పత్రం ఇవ్వగానే సింగరేణి యాజమాన్యం భాద్యత తీరిపోలేదన్నారు. కార్మిక సమస్యలు పరిష్కరించడానికి సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశాల్లో సూచించిన సమస్యల పరిష్కారంలో యాజమాన్యం కాలయాపన చేసిన నేపథ్యములో గుర్తింపు సంఘం సహించేది లేదన్నారు. కార్మికుల పక్షాన పనిచేయడమే తమ సంఘం ధ్యేయమన్నారు. అధికారులు, గుర్తింపు సంఘం సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే సంస్థతో పాటు కార్మికులు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. గుర్తింపు హోదా నాలుగేళ్ళ పాటు ఉండే విదంగా సంబంధిత అధికారులతో చర్చలు నిర్వహించి సాధిస్తామని ఎమ్మెల్యే సాంభశివరావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య,, ప్రధాన కార్యదర్శికొరిమి రాజ్ కుమార్ , కేంద్ర కమిటీ నాయకులు , అన్ని ఏరియాల యూనియన్ బ్రాంచ్ కార్యదర్శులు, వివిధ గనుల కమిటీ భాద్యులు పాల్గొన్నారు.