Politics Telangana : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఒక పార్టీపై మరొక పార్టీ నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మీరు ఆ పార్టీలో విలీనం అవుతున్నారు అంటే. కాదు మీరే ఆ పార్టీలో విలీనం అవుతున్నారు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. శుక్రవారం విలీనం ముచ్చట తో మీడియా కు కూడా చేతినిండా పనిదొరికింది. ఒకరికి ఒకరు తగ్గకుండా నేతలు డైలాగ్ లు విసురుతున్నారు. అతి తొందరలోనే బిఆర్ఎస్ పార్టీ బీజేపీ లో విలీనం అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని కేటీఆర్ ఖండించారు.
ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ బీజేపీ లో విలీనం కావడం ఖాయమన్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా విలీనం తప్పదన్నారు. అందుకు ప్రతిఫలంగా మాజీ సీఎం కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్రములో మంత్రి పదవి, హరీష్ రావుకు ప్రతిపక్ష నాయకుడి పదవి, కవిత కు బెయిల్ తో పాటు రాజ్యసభ పదవి ఖాయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విదంగా మాట్లాడగానే కేటీఆర్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ తిప్పికొట్టారు. రేవంత్ రెడ్డి అతి తొందరలోనే అమెరికాకు అధ్యక్షుడు అవుతున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా అంటూ ఎదురు ప్రశించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రిబండి సంజయ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాటలకు ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ పార్టీలోనే అతి తొందరలోనే బిఆర్ఎస్ పార్టీ విలీనం అవుతున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేటీఆర్, కవితకు రాజ్యసభ , ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ అవుతున్నారని సంజయ్ బదులిచ్చారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఉనికి లేదు. అటువంటి పార్టీని విలీనం చేసుకోవాల్సిన అవసరం బీజేపీ పార్టీకి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.