YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ల కలంలో తిరుగులేని నాయకుడిగా కొనసాగారు. ఆయన మంత్రులు, పార్టీలో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవుల్లో ఉన్నవారు సైతం తాము చెప్పిందే వేదం అంటూ ప్రజల్లో తిరిగారు. అధికారం ఉంది కదా అని ఎక్కడ విన్నా నాయకుల గొంతు వినబడేది. వాళ్ళ మాటలకు ఎదురుచెప్పేవారు లేరు. కానీ ఇప్పుడు అంతా తలకిందులు అయ్యింది.
అధికారం పోయింది. నాయకుల గొంతు మూగబోయింది. ప్రతిపక్ష హోదాలేదు. అధికార పార్టీ ని విమర్శించడంలో వెనుకబడిపోయారు. కనీసం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు ఉండటంలేదు. రోజు,రోజుకు పార్టీ పరిస్థితి వెనుకబడి పోయింది. ఈ విదంగా ఉన్న పార్టీ పరిస్థితిని గమనించిన అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీలో మార్పులకు, చేర్పులకు నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో నాయకత్వ భాద్యులను మారిస్తేనే మనుగడ ఉంటుందని వైఎస్ జగన్ ఆలోచన అని పార్టీ వర్గాల సమాచారం.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబందించిన సమాచారాన్ని జగన్ సేకరించారు. కొత్త నాయకత్వానికి భాద్యతలు అప్పగిస్తేనే పార్టీ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం అవుతుందని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. పార్టీలో ఒకరిద్దరు, మినహా ఎవరు కూడా జగన్ ఆశించిన స్థాయిలో పనిచేయడంలేదని తెలిసిపోయింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని విమర్శించే నాయకులు కూడా పార్టీలో కరువైపోయారంటూ జగన్ తన సన్నిహితుల వద్ద అభిప్రాయపడినట్టు సమాచారం.
శ్రీకాకుళం నుంచి మొదలుకొని చిత్తూర్ వరకు పార్టీ పరిస్థితి ఇదేవిదంగా నెలకొంది. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసి ఓటమి చెందిన వారితో పాటు గెలిచిన వారు ఎక్కడ కూడా ప్రజల్లో కనబడటం లేదు. వైసీపీ ప్రభుత్వం హయాంలో మంత్రి హోదాలో వెలుగు, వెలిగిన వారి చిరునామా సైతం కనబడుతలేదని అధినేత అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. జిల్లా నేతల నిర్లక్ష్యం వల్లనే మండల పరిషద్, మున్సిపాల్టీలను కోల్పోతున్నామని జగన్ తన అనుచరులవద్ద ప్రస్తావించారని సమాచారం.
పార్టీ ని వీడుతున్న వారిని ఎందుకు ఆపడంలేదని కూడా జగన్ పలువురి నాయకుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీలో ఇప్పుడు పదవిలో ఉన్నవారిని తొలగించి కొత్త వారికి భాద్యతలు అప్పగిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనకు జగన్ వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం.