NIGAMA MEDIA (P) LTD
9.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, October 20, 2026

ప్రాణహిత నీటిని మళ్లించేందుకు కాఫర్ డ్యాం నిర్మించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

నవంబర్ నెలాఖరులోగా పనులు చేపట్టకపోతే కన్నేపల్లి పంప్‌హౌస్ వద్ద ఆందోళన
టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్ వద్ద ప్రాణహిత నది ప్రవాహాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రాణహిత నదిలో వృథాగా పోతున్న నీటిని వినియోగించుకునేందుకు కన్నేపల్లి పంప్‌హౌస్ వద్ద 93 మీటర్లకు పైగా కాఫర్ డ్యాం నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. నవంబర్ నెలాఖరులోగా కాఫర్ డ్యాం నిర్మాణ పనులు చేపట్టకపోతే కన్నేపల్లి పంప్‌హౌస్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో గోదావరి, కృష్ణా నదుల జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే కరువు పరిస్థితులను నివారించవచ్చన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రధాన లక్ష్యాల్లో నీళ్లు, నిధులు, నియామకాలు ముఖ్యమైనవని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అందుబాటులో ఉన్న జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉత్తర తెలంగాణలోని ఎస్సారెస్పీ, కడెం, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టుల ద్వారా సుమారు 37 లక్షల ఎకరాలకు నీటి స్థిరీకరణకు ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భారీగా నిధులు ఖర్చు చేసినప్పటికీ కొత్తగా సాగునీరు అందిన భూమి పరిమితంగానే ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సాగునీటి పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాలేదని ఆరోపించారు.

రోజుకు రెండు టీఎంసీల నీటిని వినియోగించుకోవాలి…….

ప్రస్తుతం ప్రాణహిత నదిలో రోజుకు సుమారు రెండు టీఎంసీల నీరు ప్రవహిస్తున్నప్పటికీ, దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని కవిత అన్నారు. కన్నేపల్లి పంప్‌హౌస్ వద్ద కాఫర్ డ్యాం నిర్మించడం ద్వారా మేడిగడ్డపై ఆధారపడకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నీటిని ఎత్తిపోయవచ్చని పేర్కొన్నారు. ఈ నీటితో వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్లను రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో నెలన్నర రోజుల్లో ఈ పనులు పూర్తి చేయవచ్చని తమ అంచనా అని తెలిపారు. ఈ ప్రతిపాదనకు సంబంధించిన సాంకేతిక వివరాలను కూడా ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇంజినీర్లు అవసరమైన మార్పులు సూచిస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

రైతులకు నీరు, విద్యుత్ అందించాలి….

రాష్ట్రవ్యాప్తంగా రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు కోటి 36 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా, ఈ ఏడాది కోటి 10 లక్షల ఎకరాల్లో సాగు జరిగినట్లు పేర్కొన్నారు. పంటలు కీలక దశలో ఉన్నందున రైతులకు నిరంతరాయంగా విద్యుత్, సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసైనా సరఫరా చేయాలని గతంలోనే ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. సమస్యలను ఎత్తిచూపడమే కాకుండా, వాటి పరిష్కారానికి కూడా తమ పార్టీ సూచనలు చేస్తోందన్నారు.

మేడిగడ్డ మరమ్మతులు చేపట్టాలి

మేడిగడ్డ బ్యారేజీని సాకుగా చూపి రైతులకు నష్టం కలిగించవద్దని కవిత ప్రభుత్వానికి సూచించారు. కాఫర్ డ్యాం నిర్మాణంతో పాటు మేడిగడ్డ మరమ్మతుల పనులను కూడా ప్రారంభించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు ప్రాజెక్టుల అనుసంధాన వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరింత విస్తీర్ణానికి నీరు అందించాలంటే కాలువల నిర్మాణం పూర్తిచేయాలని పేర్కొన్నారు. అవసరమైన కాలువల పనులకు భారీగా నిధులు కావాల్సి ఉండటంతో, ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ వ్యయంతో సాధ్యమయ్యే ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.

రానున్న రోజుల్లో కరువు తీవ్రత పెరిగే అవకాశం

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది వర్షాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళనలు ఉన్నాయని కవిత అన్నారు. ఇప్పటికే అనేక చెరువులు ఎండిపోవడంతో మత్స్యకారులైన ముదిరాజ్, బెస్త కుటుంబాలు ఉపాధి సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో తాగునీరు, సాగునీటి అవసరాలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సంఘాల్లో రాజకీయాలకు తావివ్వకుండా రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రికి సూచించారు. తమ ప్రతిపాదనలను ప్రభుత్వం అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని, ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతులకు నీరు అందించేందుకు తాము సూచించిన పరిష్కారాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కల్వకుంట్ల కవిత కోరారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.