కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
దోమకొండ మండల కేంద్రంలోని వారపు సంతలో సోమవారం సాయంత్రం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై కళాజాత నిర్వహించారు. నందిని కళాబృందం సభ్యులు కళారూపాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
హెచ్ఐవీ వ్యాప్తి చెందే మార్గాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్షను రూపుమాపాల్సిన అవసరం తదితర అంశాలను కళాజాత ద్వారా వివరించారు. హెచ్ఐవీపై ప్రజల్లో అపోహలు తొలగించి, సరైన అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, శివరాం మందిర్ ఆలయ కమిటీ చైర్మన్ కొండ అంజయ్య, ఐసీటీసీ కౌన్సిలర్ మేక నాగరాజ్, లింక్ వర్కర్ బాల్ కిషన్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

