BJP : తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష నియామకానికి ఎట్టకేలకు కదలిక వచ్చింది. గత కొన్ని నెలలుగా అప్పుడూ, ఇప్పుడూ అంటూ సోషల్ మీడియాలో వార్తలు మోగినై. ఈయనే అధ్యక్షుడు, కాదు ఈయన అధ్యక్షుడు అంటూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ని తొలగించి కిషన్ రెడ్డి కి పార్టీ పగ్గాలు అప్పగించారు. పగ్గాలు చేతికి వచ్చినప్పటికీ ఆయన పార్టీ పరిపాలనలో విజయవంతం కాలేకపోయారు. కేంద్ర మంత్రిగా తీరిక లేకుండా బాధ్యతల్లో మునిగిపోవడమే ప్రధాన కారణం. ఎన్నికల పరిశీలకుడిగా పార్టీ శోభాకరాండ్లాజే ను నియమించింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మరో అవకాశం ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇదే విషయాన్ని ఆయనతో చర్చలు కూడా జరిపారు. కానీ ఆయన ఒక షరతు పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు అధ్యక్షుడిగా కొనసాగిస్తేనే భాద్యతలు చేపడుతానని పెద్దల ముందు చెప్పేశారు. ఆ విషయం అక్కడితోనే నిలిచిపోయినట్టుగా సమాచారం. ప్రధాన మంత్రి మోదీ, హోం మినిస్టర్ అమిత్ షా, సంఘ్ పరివార్ ఉమ్మడి ఆలోచన మరో విదంగా ఉంది. కాబోయే అధ్యక్షుడు బీసీ నేత అయ్యుండాలి. మొదటి నుంచి సంఘ్ పరివార్ నుంచి ఎదిగిన నాయకుడై ఉండాలి. ఈ రెండు అంశాలను ప్రధానంగా తీసుకొని ఎంపిక చేయనున్నారని సమాచారం.
ప్రస్తుతం శనివారం నామినేషన్ వేసిన వారిలో రఘునందన్ రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, తల్లోజు ఆచార్య, రాంచందర్ రావు ఉన్నారు. ఆ ఆరుగురిలో సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వారిలో రాంచందర్ రావు, తల్లోజు ఆచార్య మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరిలో కూడా బీసీ నేత ఆచార్య మాత్రమే కావడం విశేషం. ఈటల రాజేందర్ పై కొందరికి ఒక రకమైన అయిష్టత ఉంది. రఘునందన్ రావు మొదట సంఘ్ కార్యకర్తనే. కానీ మధ్యలో ఆయన బిఆర్ఎస్ లో చేరారు. డీకే అరుణ కాంగ్రెస్ నుంచి వచ్చి కండువా కప్పుకున్నారు. ధర్మపురి అరవింద్ బీసీ నేత, కానీ సంఘ్ పరివార్ కాదు. వీరందరిపై పార్టీ పెద్దలు ఈ పాటికే ఒకదఫా చర్చించారు.
మరో కోణంలో కూడా పార్టీ ఆలోచన చేస్తోంది. రాష్ట్ర సీఎం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఆ జిల్లాకు చెందిన డీకే అరుణ, ఆచార్య ఉన్నారు. వీరిద్దలో ఒకరికి ఇస్తే సీఎం ను రాజకీయంగా ఎదుర్కోవచ్చనేది ఒక ఆలోచన. ఉమ్మడి నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ధర్మపురి అరవింద్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అరవింద్ ను నియమిస్తే పీసీసీ చీఫ్ కు రాజకీయంగా ఎదుర్కోడానికి అవకాశం ఉంటుందనే ఆలోచన ఉన్నట్టు సమాచారం.
రాబోయే కొత్త కాషాయం దళపతి పదవి ముళ్ళ కిరీటమే. రాష్ట్రంలో యోధాను యోధులు ఉన్నారు. 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. అదే విదంగా రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా కమిటీలు, జాతీయ కమిటీలో భాద్యులను సమన్వయం చేసుకుంటూ, పార్టీని ప్రగతిపథంలో నడిపించాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలి. అప్పుడే అధ్యక్ష పదవికి న్యాయం చేసిన వారవుతారని కాషాయం శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.