Private education : ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని కోరుతూ సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అసిస్టెంట్ కలెక్టర్ కు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు, పలువురు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్బంగా పెద్దపెల్లి పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి వాజిద్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాల్లో పలు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లి దండ్రుల నుంచి అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించి ఫీజు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
కొందరు విద్యాసంస్థల ఆవరణలోనే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు మార్కెట్ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నారని అయన ఆరోపించారు. నర్సరీ చదివే విద్యార్ధి నుంచి రు : 15,000 ఫీజు వసూలు చేస్తున్నారని అన్నారు. ఎల్కేజీ విద్యార్థికి ఐదువేల రూపాయల పాఠ్య పుస్తకాలను అప్పజెపుతున్నారని ఆరోపించారు. జూనియర్ కళాశాలల యజమాన్యాల్లో కొందరు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫీజు రు : 30,000 వసూలు చేస్తున్నారని అన్నారు.
ప్రైవేట్ యాజమాన్యాలు అధిక ఫీజు వసూలు చేస్తున్న విషయం తెలిసి కూడా సంబంధిత అధికారులు స్పందించక పోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు కనీసం విద్యాసంస్థలను పర్యవేక్షించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించి విద్యార్థులను, వారి తల్లి దండ్రులను ఆర్థికంగా ఇబ్బందులు పెడ్దుతున్న విద్యాసంస్థల పై శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు.
అదేవిదంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడే విదంగా కనీస సౌకర్యాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పాఠశాలల్లో మూత్రశాలలు,తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కాబట్టి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తగిన వసతులు వెంటనే కల్పించాలని ఆయన సంబంధిత ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రెమ్మ సతీష్. అజయ్. మోయిన్ తదితరులు పాల్గొన్నారు.