BRS : ఉద్యమంలో గులాబీ పార్టీకి అధికారం లేదు. అయినా రాష్ట్ర సాధన కోసం నీ, నా అనే భేదం లేకుండా పార్టీ జెండా మోశారు. కలిసికట్టుగా ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్రము ఏర్పడింది. పదేళ్లు అధికారాన్ని అనుభవించారు గులాబీ శ్రేణులు. పదేళ్ల పరిపాలనలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు. కానీ మూడోసారి అధికారం చేజారిపోయింది. అధికారం ఉన్నన్ని పదేళ్ల కాలంలో గల్లీ కార్యకర్త నుంచి మొదలుకొని ఎంపీ వరకు ప్రజల్లో మెదిలారు. రాజభోగం అనుభవించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయి పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన వారు అధికారం పోయిన నేపథ్యంలో కార్యకర్తలకు అక్కడక్కడ మొహం చాటేస్తున్నారని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షాత్తు పార్టీ అధినేతనే ప్రజల్లోకి రావడంలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన వారు, ఓటమి చెందిన వారు చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన వారు, ఓడినవారు పట్టించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ ధాటిని ఎదుర్కోలేక సతమతమవుతున్నారు. అధికారపార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదంటున్నారు. ప్రథమశ్రేణి నాయకులే ముందుకు రావడంలేదు. తామెలా వచ్చి అధికారపార్టీని నిలదీస్తామంటున్నారు.
ఇకపోతే కేటీఆర్ హైదరాబాద్ కె పరిమితమైనారు. అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ గడపదాటి రావడంలేదు. హరీష్ రావు కూడా రాజధాని దాటి రావడంలేదు. అప్పుడప్పుడు మీడియాతో జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎవరు ఏది చేసినా హైద్రాబాద్ లో ఉండి మీడియా తో మాట్లాడుతున్నారు. కానీ జిల్లాలల్లో పర్యటిస్తూ కార్యకర్తలకు మానసికంగా అండగా ఉంటలేరని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
కొందరు జిల్లా అధ్యక్షులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారనే పేరు కూడా ఉంది. కనీసం నెలలో ఒకసారైనా కార్యకర్తలను కలుసు కోలేకపోతే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికల కాలం. రైతు రుణమాఫీ పథకం విఫలమైనది. కనీసం ఈ పథకం గురించి ప్రజల్లోకి వెళితే రాబోయే ఎన్నికల్లో కొంతమేర అయినా ఫలితం ఉండేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా కార్యకర్తలను అంగడిలో బిడ్డల మాదిరిగా గాలికి వదిలేసి పలువురు నాయకులు హైద్రాబాద్ కె పరిమిత కావడం పై గులాబీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

by