YS JAGAN : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అధికారం పోయింది. గడిచిన ఐదేళ్ల కాలంలో ఆయనకు అంతో,ఇంతో బీజేపీ నీడ దొరికింది. దాంతో ఆయన ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా నిద్ర పోయారు. ఏపీ లో ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి కమలం నీడ కరువైపోయింది. ఇప్పుడు ఆయనకు నా అనేవారు ఎవరు కూడా ఎక్కడ కనబడుటలేరు. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి జైలు చరిత్రను సంబంధిత అధికారులు మరోసారి చదివితే అప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి ? ఆయనను కనీసం పరామర్శించే వారు ఎవరైనా ఉంటారా అంటే ఎంత వెదికినా కనబడుట లేదు. కనీసం ఆడపడుచు షర్మిల కూడా ఓదార్చే పరిస్థితి లేదు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబును కాదని ఓదార్చ లేదు కాబట్టి ఆయన ఆందోళన చెందక తప్పడం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన ఒక కొత్త ఇంటిని వెదుక్కుంటున్నారు. రాష్ట్ర ప్రజలు వరదలతో తల్లడిల్లుతుంటే పరామర్శ కార్యక్రమాన్ని “మమ” అనిపించారు. ఏదయినా జరగరానిది జరిగితే ఇప్పుడు ఆయనను పరామర్శించే వారు కావాలి. అందుకనే జగన్ మోహన్ రెడ్డి బెంగులూర్ లో మకాం వేశారు. అక్కడ కాంగ్రెస్ నాయకులను మచ్చిక చేసుకోడానికి విందులు ఏర్పాటు చేశారని పెద్ద ఎత్తున ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విందు ఆరగించడానికి కాంగ్రెస్ నాయకులు వస్తున్నారనేది స్పష్టం. కానీ ఎవరెవరు జగన్ పిలిస్తే విందుకు వచ్చి వెళుతున్నారు అనే సమాచారాన్ని వైసీపీ నేతలు దాచి పెడుతున్నారు.
విందుకు మాత్రం దక్షణాది రాష్ట్రాల వ్యవహారాలు చూస్తున్నకాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఒకరు వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే విషయం నుంచి నేటి వరకు కూడా ఆ ముఖ్య నేత ఏపీ భాద్యతలు చూస్తున్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ కుటుంబంతో ఆ నాయకుడికి ఆరోగ్యకరమైన వాతావరణం కూడా ఉంది. ఆ వాతావరణంతోనే జగన్ ఆ నాయకుడితో సంధి మార్గం మంతనాలు జరుపుతున్నారని కొందరు ఏపీ కాంగ్రెస్ నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు.
కాంగ్రెస్ నుంచి జగన్ ఎప్పుడైతే విడిపోయారో అప్పటి నుంచి కాంగ్రెస్ పై ఎన్నో నిందలు మోపారు. భవిష్యత్తులో కాంగ్రెస్ గడప తొక్కేది లేదన్నట్టుగా ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ గడప తొక్కడానికి బెంగుళూర్ లో మకాం వేశారు జగన్ మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ పై అబద్దాలు సృష్టించి తన మీడియాలో రాయించుకున్నారు. పార్లమెంట్ లో మాజీ ప్రధాని నెహ్రు ను కూడా వదిలిపెట్టలేదు. ఆ విమర్శలు విన్నవారికి అనేక అనుమానాలు కూడా కలిగినవి. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడేనా అనే అనుమానాలు కూడా రాజకీయవర్గాల్లో కలిగినవి. ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్తులో అయినా నన్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇండియా కూటమి ఓదార్పు తోపాటు మద్దతు ఇవ్వడానికే జగన్ బెంగళూర్ లో మకాం వేసినట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ మద్దతు పొందడానికి తోబుట్టువు షర్మిలను కాదని జగన్ మోహన్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. రాజకీయ విందులు ఏర్పాటు చేశారు. అవి ఏమేరకు విజయవంతం అవుతాయో తెలియదు. ఎందుకంటే అవతలి వ్యక్తి అవసరం మేరకే విందులు విజయవంతం అవుతాయి. ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలరాదు అన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి నీడ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పై పడకుండా వైఎస్ షర్మిల కూడా ఢిల్లీలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం.