PCC President : గత కొన్ని నెలల నుంచి తెలంగాణ పీసీసీ పదవిని భర్తీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కుస్తీ పడుతున్నారు. సలహాలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు కూడా ఢిల్లీ పెద్దలు పరిగణలోకి తీసుకున్నారు. సీఎం తో పాటు డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులను కూడా సంప్రదించారు. సీఎం రేవంత్ రెడ్డి తరహలో పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడి కోసం పార్టీ ఇంకా జల్లెడ పడుతూనే ఉంది. రెండు రోజుల నుంచి సీఎం ఢిల్లీ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ ఎంపిక పై ఢిల్లీ పెద్దలు ఫైనల్ కు వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం.
సీఎం మాత్రం మహేష్ కుమార్ గౌడ్ కే మార్కులు వేసినట్టు సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ , అడ్లూరి లక్ష్మణ్ , ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ లు పదవి కోసం కుస్తీ పడుతున్నారు. రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో పెట్టినా అందరిని కలుపుకొని పోవాలి. రేవంత్ రెడ్డి మాదిరిగా పార్టీని నడిపించే సత్త వీరిలో ఎవరికి ఉందా అని పార్టీ పెద్దలు తలపట్టుకోక తప్పలేదు.
సీనియర్, జూనియర్ లను కలుపుకొని పోయే సత్తా మంత్రి శ్రీధర్ బాబుకు ఉందని పార్టీ విశ్వసిస్తోంది. శ్రీధర్ బాబు వైపు హైకమాండ్ మొగ్గు చూపడంతో ప్రవేశ పరీక్ష మల్లి మొదటికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సీఎం పదవి ఓసి అభ్యర్థి, ఇప్పుడు పీసీసీ పదవి కూడా ఓసి కి ఇచ్చిన నేపథ్యంలో బీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారు.
సీఎం మహేష్ కుమార్ గౌడ్ కు మార్కులు వేశారు. అధిష్టానం రాజకీయ సమీకరణాలు చూస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీధర్ బాబు, మహేష్ కుమార్ గౌడ్ ఫైనల్ కు చేరారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు పీసీసీ కావడం ఖాయమనే అభిప్రాయాలు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు.