Smashanavatika : మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మున్సిపాల్టీ. పేరుకు మాత్రమే పెద్ద పట్టణం. ఇంకా చెప్పాలంటే పారిశ్రామిక ప్రాంతం. ఎందరికో ఉపాధినిస్తున్న మందమర్రి. కానీ పట్టణ ప్రజలకు అత్యంత అవసరమైన శ్మశానవాటికను మాత్రం ఇవ్వలేక పోయింది. పట్టణంలోని అంగడిబజార్, ఇందిరానగర్, శాంతినగర్, రామన్ కాలనీ, మారుతీ నగర్, విద్యానగర్, ఎస్సీ. ఎస్టీ కాలనీ, యాపల్ ఏరియాల్లో సుమారు ముప్ఫయ్ వేల జనాభా ఉంటుంది. ఈ ఏరియాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, సింగరేణి ఉద్యోగులతో పాటు దినసరి కూలీ చేసుకునే వారు సైతం ఉన్నారు. పారిశ్రామిక ప్రాంతంగా గత అరవై ఏళ్ల నుంచి దశలవారీగా మందమర్రి అభివృద్ధి చెందింది. గ్రామపంచాయితీ నుంచి నోటి ఫైడ్ ఏరియా ఆ తరువాత మున్సిపాల్టీ గ ప్రభుత్వ రికార్డ్ సృష్టించింది.
కానీ ఆయా కాలనీ వాసులకు మాత్రం శ్మశానవాటిక సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎన్నోసార్లు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మొరపెట్టుకున్నా కనికరించలేదు. కార్మిక వర్గాలు కూడా సింగరేణి అధికారులను, యూనియన్ నాయకులను సంప్రదించారు. అయినా మందమర్రి ఏరియా అధికారులు, కానీ కార్మిక సంఘాలు కాని సమస్యను పట్టించుకోకపోవడం శోచనీయం. ఎవరైనా మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు దహన సంస్కారాలు చేయడం ఈ ప్రాంత ప్రజలకు పెద్ద సమస్య అయ్యింది.
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శ్మశానవాటిక నిర్మాణం కోసం ఒక కోటి అరవై లక్షల రూపాయల నిధులు మంజూరైనాయి. సకాలంలో పనులు చేపట్టక పోవడంతో నిధులు మురిగిపోయాయి. సంబంధిత అధికారులు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తో పనులు చేయించడంలో నిర్లక్ష్యం వహించడంతోనే నిధులు వెనక్కి పోయాయని పట్టన ప్రజలు ఆరోపిస్తున్నారు.
పట్టణంలోని ఆయా కాలనీవాసులందరూ ఇప్పుడు ఏకమైనారు. ప్రజా ప్రతినిధులను, సింగరేణి అధికారులను, కార్మిక సంఘాల నాయకులను కాదని ఒక్కటైనారు. చేయి, చేయి కలిపారు. సోషల్ మీడియా ను వేదిక చేసుకున్నారు.ఆయా కాలనీవాసులందరు కలిసి శ్మశానవాటికను నిర్మించుకోడానికి ముందుకు వచ్చారు. చందాలతో నిర్మించడానికి సిద్ధం కావడం విశేషం.