Manda Krishna : లక్ష్యం ఒకటే. వేసిన అడుగులు కూడా వెనక్కి తగ్గలే. అనుకున్నది సాధించే వరకు అలుపెరగని పోరాటం. మూడు దశాబ్దాలపాటు సుదీర్ఘ ప్రయాణం. ఆ పోరాటంలో ఎన్నింటిని ఎదుర్కోవాలో, వాటన్నిటిని ఎదుర్కొన్నాడు. చివరకు అనుకున్నది సాధించాడు. సుప్రీం కోర్ట్ తను కలలుగన్న తీర్పు వెలువరించగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనే ఎస్సీ వర్గీకరణ ఉద్యమనేత మంద కృష్ణ.
వర్గీకరణకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. ఎవరి కోసమైతే వర్గీకరణ కావాలని పోరాటం చేసాడో, ఇప్పుడు వారి అభివృద్ధి కోసం పాటు పడాల్సిన అవసరం కూడా వచ్చింది. అందుకు ఎదో ఒక రాజకీయ వేదిక తప్పనిసరి. ఉద్యమం వైపు ఇన్ని రోజులు వేసిన మంద కృష్ణ అడుగులు ఇప్పుడు ఎటువైపు పడుతాయని రాజకీయ శ్రేణులు చూస్తున్నారు. ఎస్సీ వర్గకరణ కోసం భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది.
ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంద కృష్ణ కు అండగా నిలిచిన సామాజిక వర్గం అంతా కూడా బీజేపీ కి మద్దతు పలికింది. వర్గీకరణ సమస్య పరిష్కారం కావడంతో మంద కృష్ణ బీజేపీ నీడన ఉండే అవకాశాలు సైతం ఉన్నాయని రాజకీయ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.
అవసరమైతే బీజేపీ మంద కృష్ణ ను రాజకీయంగా కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం రావొచ్చు. ఒకవేళ అయన కాషాయం కండువా కప్పుకుంటే అయన సామజిక వర్గం అంతా కూడా బీజేపీ వైపే వెళుతుంది. దింతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలు సైతం ఉన్నాయనే అభిప్రాయాలు రాజకీయ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ మంద కృష్ణ బీజేపీ లో చేరితే ఆయనకు పార్టీలో సముచిత స్తానం కూడా లభిస్తుంది. బీజేపీ ఆహ్వానాన్ని కూడా కాదనే పరిస్థితి లేదు. ఏది ఏమైనప్పటికీ బీజేపీ నుంచి స్పందన వస్తే మంద కృష్ణ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.