Srisylam : ఒక్క కిలో కాదు… ఐదు కిలోలు కాదు… వంద కిలోలు అసలే కాదు … ఏకంగా నాలుగు వేల కిలోల పూలు…. ఇంకా చెప్పాలంటే నాలుగో, ఐదో కాదు…. నలబై రకాల పూలు…. అంటే నాలుగువేల కిలోల పూలను, నలబై రకాలుగా తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. ఎక్కడ అంటే… శ్రీశైలం పుణ్య క్షేత్రంలో ఆదిదంపతులకు ఆలయ నిర్వాహకులు, అధికారులు, వేదం పండితులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఘనంగా నలబై రకాల పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు.
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్కమహాదేవి అలంకార మండపంలో సాయంత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. ఈ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలడంలేదు. ఎంత సేపు చూసిన తనివితీరలేదంటున్నారు భక్తులు. వేదపండితులచే చతుర్వేద పారాయణలు జరిపించారు.
శివ సహస్రనామ స్తోత్ర పారాయణలు, లలితాసహస్రనామ పారాయణలు కూడా జరిపించారు. లోకకల్యాణం కోసం పుష్యశుద్ధ ఏకాదశిన స్వామిఅమ్మవార్లకు పుష్పార్చన జరిపించామని శ్రీశైల ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. నాలుగువేల కిలోల, నలబై రకాల పువ్వులను పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ పూర్తి విరాళంగా సమర్పించి తన భక్తిని చాటుకున్నారు.