Home » మోడల్ స్కూల్‌లో విద్యార్థి మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమే

మోడల్ స్కూల్‌లో విద్యార్థి మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమే

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):

మృత విద్యార్థి కుటుంబానికి రూ.30 లక్షల పరిహారం
కుటుంబ సభ్యుడికి ఉద్యోగం కల్పించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ డిమాండ్

పెద్దపల్లి పార్లమెంట్ టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ఎండి వాజిద్ ప్రభుత్వం, మోడల్ స్కూల్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల రామగుండం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్‌లో జరిగిన విషాద ఘటనలో ఎనిమిదో తరగతి విద్యార్థి వెంచర్ల సాత్విక్ మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు.

పెద్దపల్లిలో ఆయన మాట్లాడుతూ, పేరుకే మోడల్ స్కూల్ అని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, విద్యార్థుల భద్రత విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆరోపించారు. విద్యార్థులు ఆటలు ఆడే సమయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పర్యవేక్షణ ఉండాల్సి ఉండగా అది జరగలేదని, అలాగే పాఠశాల యాజమాన్యం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. పాఠశాల వెనుక భాగంలో రక్షణ (ప్రహరీ) గోడ లేకపోవడంతో, ఆటలో భాగంగా బంతి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిందని, దానిని తీసుకురావడానికి ప్రయత్నించిన విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడని తెలిపారు. పాఠశాల చుట్టూ ఆరు నుంచి ఏడు అడుగుల ఎత్తైన ప్రహరీ గోడ నిర్మించి ఉంటే ఈ విషాదం జరిగేది కాదని పేర్కొన్నారు.

ఈ ఘటనకు ప్రభుత్వం, పాఠశాల యాజమాన్యం రెండూ బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన ఎండి వాజిద్, కేవలం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయడం ద్వారా బాధ్యత నుంచి తప్పించుకోలేరని అన్నారు.మృత విద్యార్థి వెంచర్ల సాత్విక్ కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలోని ఒకరికి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ తరఫున డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మోడల్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రమాదకర ప్రాంతాల వద్ద వెంటనే ఆరు నుంచి ఏడు అడుగుల ఎత్తైన ప్రహరీ గోడలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోందని, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు శివ, రిమ్మ సతీష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *