Home » అటవీ అధికారులపై దాడి కేసులో తీర్పు..

అటవీ అధికారులపై దాడి కేసులో తీర్పు..

ఎనిమిది మందికి ఆరు నెలల జైలు శిక్ష
ఏడేళ్ల విచారణ అనంతరం ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు..
300 మందికి పైగా సాక్షుల విచారణ తర్వాత ఎనిమిది మంది దోషులుగా నిర్ధారణ

కోల్ బెల్ట్ న్యూస్(ఆదిలాబాద్):

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాల గ్రామంలో అటవీ అధికారులపై జరిగిన దాడి కేసులో ఏడేళ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఎనిమిది మంది నిందితులను దోషులుగా తేల్చి, ప్రతి ఒక్కరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన 2019 జూన్ 30న చోటుచేసుకుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ భూమిలో మొక్కలు నాటేందుకు భూమిని చదును చేయడానికి అటవీ శాఖ అధికారులు కొత్త సార్సాల గ్రామానికి వెళ్లారు. అప్పటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) చోళ అనిత నేతృత్వంలోని అధికారుల బృందాన్ని గ్రామస్థులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అనంతరం ఘర్షణకు దారితీసింది.

ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు కర్రలతో అటవీ అధికారులపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడిలో ఎఫ్ఆర్వో చోళ అనితతో పాటు పలువురు అటవీ శాఖ అధికారులు గాయపడ్డారు. అప్పట్లో ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారని ఆరోపణలు నమోదయ్యాయి. ఎఫ్ఆర్వో చోళ అనిత ఫిర్యాదు మేరకు కాగజ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా మొత్తం 39 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు, హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, దాడి తదితర అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు పూర్తి చేసి 2020లో కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 300 మందికి పైగా సాక్షులను విచారించిన న్యాయస్థానం, సమర్పించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించింది. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు భూరం పోసం, పుల్ల శ్రీకాంత్, కొట్ట మల్లేష్, బొబ్బర శంకర్, రాజశేఖర్, భూరం మల్లేష్, బచ్చే శ్యామలకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో దాదాపు ఏడేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసుకు న్యాయపరంగా ముగింపు లభించింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *