కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో TGBKS
సంస్థను కాపాడుకోడానికే సంఘమంటున్న మల్లయ్య
పదేళ్ల అధికారాన్ని ప్రశ్నిస్తున్న కార్మికులు
జాతీయ సంఘాలే జాగరణ చేస్తున్న కాలం
కోల్ బెల్ట్ న్యూస్, కొత్తగూడెం : సింగరేణి బొగ్గుగని కార్మికుల హక్కుల సాధన కోసం 64 సంఘాలు ఆవిర్భవించాయి. కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు రావడంతో ఆ సంఖ్య 22 కు పడిపోయింది. ప్రస్తుతం 13 సంఘాలు ఉండగా అందులో ఐదు జాతీయ సంఘాలు, కొన్ని ప్రాంతీయ, మరికొన్ని విప్లవ కార్మిక సంఘాలు కొనసాగుతున్నవి. ఏ సంఘమైన కార్మిక హక్కుల కోసం పోరాడేది. వారి పోరాటాల ఫలితంగానే అనేక హక్కులు సాధించుకున్నారు కార్మికులు. వాటితో పాటు అపరిష్కృత సమస్యలను కూడా పరిష్కరించుకున్నారు. కార్మికుల కోసం సంఘాలు సమ్మె బాట పట్టిన సందర్భమైన, చర్చల సమయమైనా సమస్యలను యాజమాన్యం పరిష్కరించేది. కానీ యాజమాన్యం ఏది చేయాలనుకుంటే ఆ విషయాన్ని చేసి తీరుతుంది. సంఘాల పని సంఘాలు చేస్తుంటే, యాజమాన్యం పని యాజమాన్యం చేస్తూ ముందుకు వెళుతుంది. ఈ విషయం తెలిసి కూడ సంఘాలు పలు సందర్భాల్లో ప్రేక్షక పాత్రనే పోషిస్తాయి. కానీ యాజమాన్యం చేపట్టిన నిర్ణయాలను వ్యతిరేకిస్తాయి. అయినా యాజమాన్యం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే తీరును ప్రదర్శించి సంఘాలను ఒప్పిస్తుంది, నమ్మిస్తుంది.
సంఘాలు ఎంత అరచి గగ్గోలు పెట్టినా కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ సింగరేణిలో అత్యంగ వేగంగా దూసుకెళుతున్నాయి. దూసుకెళ్లాయి కూడా. శాశ్వత నియామకాలు లేవు. ఆర్థిక భారం తడిసి మోపెడైనది. 38 వేల మంది కార్మికులకు వేతనాలు ఇవ్వడానికే సంస్థ సతమతమవుతోంది. ఇలా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సింగరేణిలో కొత్త సంఘం అవసరమా అంటున్నారు కార్మికులు. ఎందుకంటే సంఘాలు ఎన్నో సమ్మెలు, నిరసనలు, ధర్నాలు చేసినా యాజమాన్యం ఏమి సాధించాలనుకుందో దాన్ని సాధించి తీరింది. ఇప్పుడు కొత్తగా కెంగర్ల మల్లయ్య సారధ్యంలో ఆవిర్భవించిన సంఘం ఏం సాధిస్తుందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సంఘం వెనుక ఉన్న మతలబు ఏమిటని కూడా అంటోంది కార్మిక వర్గం. అంతే కాదు పదేళ్ల అధికారం, రెండు దఫాలుగా కార్మిక గుర్తింపు సంఘం, ఒకసారి జాతీయ సంఘం లో భాద్యతలు చేపట్టి ఇప్పుడున్న సమస్యలను అప్పుడే ఎందుకు పరిష్కరించలేదంటున్నారు. అంతే కాదు ” మెడికల్ బోర్డు ” ను ” మనీ మేకింగ్ బోర్డు ” గా ఆరోపణలు వచ్చింది మీ హయాంలోనే కదా అని కూడా అంటున్నారు కార్మికులు.
కార్మిక సమస్యలపై జాతీయ సంఘాలే సింగరేణిలో జాగరణ చేస్తున్న కాలం నడుస్తోంది. ఈ నేపథ్యంలో నీతో ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని కూడా కార్మికులు అడుగుతున్నారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో సింగరేణిలో ఏం జరగాలని రాసిపెట్టి ఉందో అదే జరిగింది. ఏ పార్టీ మద్దతు లేకుండా ఒంటరి పోరాటం చేసి ఏం సాధిస్తారని కూడా కార్మిక వర్గం ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. వారికున్న బలంతో సింగరేణి సమస్యలపై వారు వారి సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేయాలనుకుంటే చేస్తారు. ఎందుకు చేయడం లేదు. ఎందుకంటే సంస్థ అవసరం, ఉత్పత్తి, ఉత్పాదకత, భవిష్యత్తు అవసరాల కోసం ఏమి చేయాలని నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేసి తీరుతుంది. అటువంటప్పుడు కెంగర్ల మల్లయ్య కొత్త సంఘం సింగరేణికి, కార్మిక వర్గానికి ఏం సాధించి పెడుతుందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
కొత్త సంఘం పెట్టిన కెంగర్ల మల్లయ్య సొంత పరపతిని సింగరేణిలో పెంచుకోడానికే అంటున్నారు కార్మికులు. ఆయన వెనుక ఉండి సంఘాన్ని నడిపించాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదంటున్నారు. రాబోయే అవసరాల కోసం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ఇద్దరు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వెనుక ఉండి సంఘాన్ని పెట్టించారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. రామగుండం రీజియన్ లో తన వ్యక్తిగత పలుకుబడిని పెంచుకొని రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికే అంటున్నారు కొందరు రాజకీయ శ్రేణులు. సింగరేణిని కాపాడుకోడానికే సంఘం పెట్టానని కెంగర్ల మల్లయ్య చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంతవరకు విజయం సాధించి తీరుతారో వేచిచూడాల్సిందే.

by