YSRCP : ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ గల్లీ కార్యకర్త నుంచి మొదలు కొని రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు ఆడింది ఆట, పాడింది పాట కొనసాగింది. అధికారం పోగానే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నన్నినాళ్లు చేసిన చేష్టలు చూసిన కూటమి నేతలు ఇప్పుడు కండువా మారుస్తామంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. పార్టీ ని పట్టుకొని ఉందామంటే పట్టించుకునే నాయకుడు కరువైపోయాడు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే వైసీపీ క్యాడర్ పరిస్థితి కుడితి లో పడ్డ ఎలుకలా తయారైనది. ఇటీవల పార్టీలో జరిగిన పలు సంఘటనలతో ఏకంగా అధినేత జగన్ పైననే అసంతృప్తితో ఉన్నారు.
ఎన్నికల ఫలితాలపై పందెంపెట్టి నష్టపోయిన నాగమల్లేశ్వరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనితోపాటు మరికొందరు కూడా ఆర్థికంగా కొందరు, మరికొందరు ఆత్మహత్యతో కుటుంబాలకు దూరమైనవారు ఉన్నారు. పార్టీని అధినేతను, నాయకులను నమ్మి దాడులకు పాల్పడి, పోలీస్ కేసులతో నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు. అటువంటి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోలేదు. కనీసం పరామర్శ కు కూడా నోచుకోలేదు. చనిపోయిన ఏడాది కాలం తరువాత నాగమల్లేశ్వరావ్ విగ్రహం పెట్టి ” మమ ” అనిపించారు. ఆయన కుటుంబానికి పైసా సాయం చేయలేదు.
నరుకుతాం, ఏస్తాం , తీస్తాం అంటూ పోస్టర్ పట్టుకొని జగన్ పర్యటనలో నిలబడి అభిమానం చాటుకున్న కార్యకర్తను చివరకు నీవు గతంలో టీడీపీ కార్యకర్తవు అంటూ ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు ఆ కార్యకర్త పోలీస్ కేసులతో సతమతమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూటమి నాయకులను బూతులు తిట్టి, వారిపై దాడులు చేసిన వారంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కనీసం లాయర్ల ఖర్చులు కూడా పార్టీ భరించడం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తలు, నేతలు అంతా కూడా త్రిశంకు స్వర్గంలో పడ్డారనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.