జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు
మూడు నెలలుగా కొనసాగిన మంతనాలు
బెడిసి కొట్టిన మంతనాలు
సమస్యగా మారిన పార్టీ నిధులు
కోల్ బెల్ట్ న్యూస్, మంచిర్యాల : తమ రాజకీయ భవిష్యత్తు కోసం రాజకీయ నాయకులు ఎదో ఒక పార్టీని ఎంచుకుంటారు. సర్పంచ్ నుంచి మొదలుకొని ఎంపీ గా పార్టీ తరుపున గెలవాలని ఆశిస్తారు. అదృష్టం కలిసొస్తే ప్రజాప్రతినిధిగా విజయం. కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్న పార్టీలో చేరుతారు కొందరు. మరికొందరు గెలిచినా, ఓడినా ఒకే పార్టీని నమ్ముకొని కొనసాగుతారు. కానీ మంచిర్యాల జిల్లాలో ఇటీవల రాజకీయంగా పెద్ద కెమిస్ట్రీ జరిగింది.
మంచిర్యాల జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏకమైనారు. వారందరు కలిసి ఒకే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణంలో ఉన్న జనసేన నేత పవన్ కళ్యాణ్ నీడన ఉంటె భవిష్యత్తు ఉంటుందని నిర్ణయం తీసుకునున్నారు. అందుకోసం పావులు కదిపారు. జనసేన లో ఉన్న కీలక నేతతో ఆ మాజీ ఎమ్మెల్యేలు మంతనాలు జరిపారు. సుమారు మూడు నెలల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కానీ ఆ మంతనాలు ఎందుకు మెడిసికొట్టాయంటే ….
తెలంగాణాలో పార్టీ అభివృద్ధి తోపాటు, కార్యక్రమాల కోసం నిధుల గురించి ప్రధానమైన చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో నిధులు ఇవ్వబోమంటూ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది. పార్టీ ఖర్చులు మీరే భరించాలి. మీ జిల్లాల్లో మీరు పార్టీకి భాద్యులు. మరొకరికి భాద్యత ఇవ్వం. కాబట్టి ఖర్చులు భరించడానికి సిద్ధమైతే కండువా కప్పుకోండి. ఈ విధంగా స్పష్టమైన పలుకులు పవన్ కళ్యాణ్ పలకడంతో ఆ మాజీ ఎమ్మెల్యేలు తూర్పు తిరిగి దండం పెట్టక తప్పలేదు.

by