Home » నీట్ పేపర్ లీక్ ఘటనపై కాసిపేట లో నిరసన

నీట్ పేపర్ లీక్ ఘటనపై కాసిపేట లో నిరసన

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్

కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట):

నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నిరసన తెలిపిన విద్యార్థులు, యువజనులపై జరిగిన లాఠీచార్జీకి ప్రధానమంత్రి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

శనివారం కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామంలోని కొమురం భీం విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. తాజాగా నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని పేర్కొన్నారు.

నీట్ పేపర్ లీక్ ఘటన అనంతరం తీవ్ర మనోవేదనకు గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆందోళనకరమని పేర్కొంటూ, మరణించిన ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులు, యువజనులు రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు, దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. పార్లమెంట్ వైపు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ, బాష్పవాయు గోళాలు, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ దెబ్బతినడం వల్ల ముఖ్యంగా ఆదివాసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. దేశ భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి గ్రామం, పట్టణంలో ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంకె రవి (సీపీఐ-ఏఎం మంచిర్యాల జిల్లా కన్వీనర్), జైపాల్ సింగ్ (తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు), పెంద్రం హన్మంత్ (తుడుం దెబ్బ మంచిర్యాల జిల్లా కమిటీ అధ్యక్షుడు), మంగ శ్రీకాంత్ (తుడుం దెబ్బ కాసిపేట మండల అధ్యక్షుడు), ఆత్రం కళావతి (రొట్టెపల్లి సర్పంచ్), పెంద్రం శంకర్ (వెంకటాపూర్ సర్పంచ్), ఆల్క రాజు (రొట్టెపల్లి ఉపసర్పంచ్), సీపీఐ(ఏఎం) నాయకులు సిడం జంగుబాయి, టేకం పార్వతిబాయి, ఆత్రం భీంబాయి, టేకం మారుబాయి, టేకం హన్మంత్, తుడుం దెబ్బ విద్యార్థి సంఘం మండల కోశాధికారి చిక్రం రాందాసు, గ్రామ పటేళ్లు సూరపం రామకృష్ణ (రొట్టెపల్లి), కోవ గణపతి (కొత్తగూడ), టేకం శ్రీనివాస్ (కొత్త తీర్మలపూర్), టేకం భీం (పాత తీర్మలపూర్), కుమురం భగవంతిరావు (భగవంతిగూడెం), వార్డు సభ్యులు పెంద్రం తిరుపతి, బత్తుల శేఖర్తో పాటు టేకం మారుతి, కుర్సింగ్ రాజేష్, జలపతి, కోవ నవీన్, ఆత్రం నాగరాజు, ఆల్క పెద్దులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *