Home » బాబాగా మారిన రౌడీషీటర్…పట్టించిన స్నేహితుడి ఫేసుబుక్

బాబాగా మారిన రౌడీషీటర్…పట్టించిన స్నేహితుడి ఫేసుబుక్

హత్య కేసులో నాన్-బెయిలబుల్ వారెంట్..
దర్గాలో బాబా అవతారం
ఏడాదికి పైగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు..
సోషల్ మీడియా పోస్టే అసలు గుట్టు విప్పింది

కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్):

నేరం చేసి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నేరస్తులు రకరకాల మార్గాలను ఎంచుకుంటుంటారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ రౌడీషీటర్ మాత్రం ఏకంగా తన రూపాన్నే మార్చుకుని బాబా అవతారం ఎత్తి ఏడాదికి పైగా పోలీసుల కళ్లుగప్పాడు. చివరకు సోషల్ మీడియాలో వచ్చిన ఓ ఫొటో అతని అసలు గుర్తింపును బయటపెట్టి పోలీసులకు చిక్కేలా చేసింది.

హైదరాబాద్‌లోని లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎస్ మక్తాకు చెందిన మహమ్మద్ జావేద్ (33) పేరుమోసిన రౌడీషీటర్. 2018లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో అతను ఐదో నిందితుడిగా ఉన్నాడు. కేసు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. జైలుకు వెళ్లకుండా ఉండేందుకు గత ఏడాది జూన్ నుంచి అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు జావేద్ సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి అక్కడి సమీపంలోని జిందేషా మదార్ దర్గాలో బాబా అవతారం ఎత్తాడు. ప్రత్యేక దుస్తులు ధరించి, భక్తులకు దువా చేస్తూ స్థానికుల విశ్వాసాన్ని సంపాదించాడు. భక్తుల మధ్య ఉంటే పోలీసులు తనను గుర్తించలేరనే ధీమాతో అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా, జావేద్ కోసం ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ బృందం, సైఫాబాద్ పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో జావేద్ వేషం మార్చుకుని దర్గాలో ఉంటున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. దర్యాప్తులో కీలక మలుపు సోషల్ మీడియా ద్వారా వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన జావేద్ స్నేహితుడు దర్గాకు వెళ్లి అతనితో దువా చేయించుకుని దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోను పరిశీలించిన పోలీసులు జావేద్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. దర్గాలోనే అరెస్ట్ చేస్తే భక్తుల నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు కొంతకాలం నిఘా ఉంచారు. చివరకు జావేద్ దర్గా నుంచి బయటకు వచ్చిన సమయంలో అదుపులోకి తీసుకున్నారు.

అతడి వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఒక క్యారీ బ్యాగ్‌లో సుమారు 115 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. అలాగే మారువేషానికి ఉపయోగించిన బాబా దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో జావేద్ తన నేరాన్ని, మారువేషం వేసుకున్న విషయాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద మరో కేసు నమోదు చేసిన పోలీసులు, గతంలో జారీ అయిన నాన్-బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేసి రిమాండ్‌కు తరలించారు.

సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, “2018 హత్య కేసులో నిందితుడైన జావేద్ పోలీసులకు చిక్కకుండా బాబా వేషంలో దర్గాలో తలదాచుకున్నాడు. ఫేస్‌బుక్‌లో వైరల్ అయిన ఫొటో ఆధారంగా అతని ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశాం. అతడి వద్ద గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నాం” అని తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *