Home » ఆగస్టు 2న AITUC మహాసభలు

ఆగస్టు 2న AITUC మహాసభలు

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):

ఆగస్టు 2న జరిగే AITUC మంచిర్యాల జిల్లా మహాసభలను కార్మికులు విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పిలుపునిచ్చారు.బెల్లంపల్లి సీపీఐ కార్యాలయంలో మహాసభల పోస్టర్‌ను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏర్పడిన తొలి కార్మిక సంఘం AITUC అని తెలిపారు. బ్రిటిష్ పాలనలో కార్మికులను ఐక్యం చేస్తూ 1920 అక్టోబర్ 31న బొంబాయిలో AITUC ఆవిర్భవించిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి వరకు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటాలు కొనసాగిస్తోందన్నారు.

AITUC పోరాటాల ఫలితంగానే కనీస వేతనాల చట్టం, కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు, సమ్మె చేసే హక్కు వంటి అనేక కార్మిక హక్కులు సాధ్యమయ్యాయని చెప్పారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను బలహీనపరుస్తోందని ఆరోపించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల పేరిట కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్నారని విమర్శించారు. కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టాలు సమర్థంగా అమలు కావడం లేదని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, ఆర్టీసీ సిబ్బంది, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, 104, 108 అంబులెన్స్ ఉద్యోగులు, ఆసుపత్రి కార్మికులు, హమాలీలు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, లారీ డ్రైవర్లు, పెయింటింగ్, సెంటరింగ్, టైల్స్, మార్బుల్ తదితర రంగాల కార్మికులు తక్కువ వేతనాలు, ఉపాధి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనాల చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని AITUC డిమాండ్ చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటస్వామి, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, శాంతిగాని, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బియ్యాల వెంకటస్వామి, మైన్ ఫిట్ కార్యదర్శి రత్నం ప్రవీణ్, దాడి రమేష్, జిల్లా సమితి సభ్యులు గుండ మాణిక్యం, రత్నం రాజం, కొంకుల రాజేష్, జాడి పోచం, AITUC నాయకులు సాకే శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *