Rev Party : బెంగుళూర్ శివారులో ఒక ప్రముఖ వ్యాపార వేత్తకు సంబంధించిన ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల వరకు హద్దులో ఉంటె బాగుండేది. కానీ హద్దులు దాటి ప్రవర్తించారు కొందరు. ఆ విషయం కాస్త సంబంధిత శాఖ అధికారులకు ఉప్పందింది. తీరా పోలీస్ అధికారులు వచ్చి తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి.
ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత బెంగుళూర్ ఎలక్ట్రానిక్ సిటీ కి చెందిన పోలీస్ అధికారులు సిబ్బంది కలిసి దాడులు చేశారు. ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆశ్చర్యానికి లోనయ్యింది. పట్టుబడిన వారంతా కూడా తెలుగు టీవీ నటులు కావడం విశేషం. వారితో పాటు కొందరు మోడళ్ళు కూడా పోలీసులకు చిక్కారు. పుట్టినరోజు వేడుకల్లో సుమారు వందమందికి పైగా ఉన్నట్టు సమాచారం. వీరిలో కొందరు తెలుగు టీవీ నటీ నటులు, మరికొందరు మోడళ్ళు కూడా ఉండటం విశేషం. వీరిని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.
ఫామ్ హౌస్ బర్త్ డే పార్టీ కి వచ్చిన ఒకరి కారులో ఏపీ కి చెందిన ఒక మంత్రి కి సంబంధించిన స్టికర్ లభించడం విశేషం. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న వారిలో కొందరు వివిధ రకాల డ్రగ్స్ వాడినట్టుగా ఆనవాలు పోలీసులకు దొరికాయి. 17 గ్రాముల MDMA తోపాటు, కొకెయిన్ కూడా పోలీసుల తనిఖీలో దొరికింది. ఫామ్ హౌస్ పరిసరాల్లో అత్యంత ఖరీదయిన పదిహేను కార్లు ఉన్నాయి. వీటిని కూడా ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలంలో ఐదుగురిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు.