YS Jagan : ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను వేధిస్తోందని ఆరోపిస్తూ వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, నష్టపోయిన తన పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు. ఈ పరిణామాలన్నిటిని పరిశీలిస్తే జగన్ బీజేపీ కి దూరం అవుతున్నారనే బలం చేకూరుతోంది. ఎందుకంటే పాత బంధాన్ని కొనసాగించాలనుకుంటే జగన్ ఢిల్లీ లో ధర్నా చేసే పరిస్థితి ఉండేది కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో జగన్ ఢిల్లీ ప్రభుత్వంకు అనుకూలంగా నడుచుకున్నాడు. ఏపీలో తెలుగు దేశం, జనసేన, బీజేపీ ఒక్కటయ్యాయి. కూటమిగా ఏర్పడటంతో జగన్ ఓటమిపాలు అయ్యారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో చేస్తున్న ధర్నాకు పలు రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. అఖిలేష్ యాదవ్, ఉద్దవ్ థాక్రే, సంజయ్ రౌత్ వచ్చి జగన్ కు మద్దతు ప్రకటించారు. అప్పటినుంచే రాజకీయ వర్గాల్లో అనుమానాలు మొలకెత్తాయి. జగన్ ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి.
ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ తరుపున 11 మంది ఎంపీలున్నారు. ఈ పదకొండు మంది ఎంపీల అవసరం భవిష్యత్తులో బీజేపీ కి అవసరం ఉంటుంది. కాబట్టి ఇంత తొందరగా బీజేపీ వైఎస్ జగన్ ను దూరం పెట్టకపోవచ్చనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ బీజేపీ కి దగ్గరగా ఉందామంటే కూడా చంద్రబాబు తట్టుకోలేడు. ఈ విషయం కూడా జగన్ కు తెలుసు.
ఇండియా కూటమికి దగ్గర కావాలంటే ముందుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంగీకరించాలి. కానీ వాళ్ళిద్దరి వద్దకు వెళ్ళడానికి జగన్ కు ఉన్న సాహసం సరిపోదు. ఈ నేపథ్యంలోనే అఖిలేష్ యాదవ్ తో సంధి మార్గం ఏర్పరచుకున్నాడని ఢిల్లీ లో ప్రచారం జోరుగా సాగుతోంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఇండియా కూటమితో వైసీపీ జతకట్టింది. బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తుందని ఎంపీ మిథున్ రెడ్డి ముందే ప్రకటించారు. ఈ బిల్లుపై ఇండియా కూటమి వాదనతో వైసీపీ జతకట్టింది.ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమికి వైఎస్ జగన్ దగ్గరయ్యేందుక ఒక అడుగు ముందుకు వేశాడనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.