Ex Mavoist arest : మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్ హుస్సేన్ అలియాస్ సుధాకర్, రమాకాంత్ ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం తెల్లవారు జామున జమ్మికుంటలో ఉన్న ఆయన ఇంటికి వచ్చి వాహనంలో తీసుకెళ్లినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరు మీరు, ఎక్కడికి తీసుకెళుతున్నారు చెప్పాలని వచ్చిన వారిని అడిగితె సమాధానం చెప్పకుండా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది ఇలా ఉండగా పోలీసులే వచ్చి తీసుకెళ్లారని, పౌరహక్కుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే హుస్సేన్ ను కోర్ట్ లో హాజరు పరచాలని నాయకులు డిమాండ్ చేశారు.
మహమ్మద్ హుస్సేన్ మందమర్రి ఏరియాలోని యాపిల్ ప్రాంతంలో ఉంటూ సింగరేణి కేకే – 2 గని కార్మికుడిగా 1975, జనవరిలో నియామకం అయ్యాడు.1974 నుంచి మావోయిస్టు పార్టీ తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఒక రోజు సమ్మెకు ఎనిమిది రోజుల వేతనాన్ని కోత విధించే చట్టాన్ని వ్యతిరేకిస్తూ హుస్సేన్ నాయకత్వంలో 1981,ఏప్రిల్ 18న సమ్మె కేకే – 2 గనిలో ప్రారంభమైనది. ఆ సమ్మె కేకే-2 మొదలై దశలవారీగా మందమర్రి ఏరియా నుంచి మొదలుకొని బెల్లంపల్లి, గోదావరిఖని, కొత్తగూడెం వరకు వెళ్ళింది. సమ్మె 56 రోజుల పాటు కొనసాగింది. ఎట్టకేలకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి టి అంజయ్య సమ్మెపై స్పందించారు. చర్చల ద్వారా చర్చలు సఫలమైనాయి. అప్పటి నుంచి ఎనిమిది మాస్టర్ల కోత చట్టం ఎత్తివేయడం జరిగింది.
కేకే-2 సమ్మె విజయవంతం అయిన తరువాత హుస్సేన్ పై తీవ్ర నిర్బంధం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఉరికి వెళ్ళలేదు. గని కార్మికునిగా విధులు నిర్వహించడం మానివేసాడు. పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. 1986.ఏప్రిల్ 1న శ్రీరాంపూర్ లో ఒకరి ఇంటిలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. మందమర్రి ఏఐటీయూసీ నాయకుడు అబ్రహం హత్య కేసులో జైలుకు వెళ్ళాడు హుస్సేన్.
1988, సెప్టెంబర్ 18న ఆదిలాబాద్ జైలు నుంచి మరో ముగ్గురితో కలిసి రెండు తుపాకులు ఎత్తుకొని పారిపోయి మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళాడు హుస్సేన్. 2009 లో మరోసారి అరెస్ట్ అయ్యాడు. ఆరున్నర సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపాడు. అప్పుడు ఆయనపై 28 పోలీస్ కేసులు నమోదయినాయి. 2015 లో జైలు నుంచి విడుదల అయిన తరువాత నుంచి సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు.
హుస్సేన్ అప్పుడప్పుడు మందమర్రి, బెల్లంపల్లి కి వచ్చి వెళుతున్నాడనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఆదే విదంగా ఆయన ఇటీవల రైల్ లో నాగపూర్ వరకు వెళ్లి వచ్చినట్టు సంబంధిత శాఖల అధికారులు సైతం గుర్తించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనను నిఘా వర్గాలు కొద్దీ రోజుల నుంచి వెంటాడుతున్నట్టు సమాచారం. హుస్సేన్ ఇంకా మావోయిస్టు పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే పోలీసులే అరెస్ట్ చేసినట్టుగా ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఒక పాత కేసుకు సంభందించిన విషయం గురించి పోలీసులే అరెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం.