Cenima Politics : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రంగుల రాజకీయం అలుముకొంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూటమిగా ఏకమైనాయి. అనుకున్నట్టుగానే జగన్ ప్రభుత్వాన్ని ఇంటిదారి పట్టించాయి. ఏపీలో కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కూటమిగా ఉన్న నాయకుల్లో ప్రధాన నాయకులందరికి సినిమా పరిశ్రమతో అనుబంధం ఉంది.
ముఖ్యమంత్రిగా నాలుగోసారి భాద్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు. ఈయన ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం ఎన్టీ రామారావ్ కు అల్లుడు. అల్లుడు కాక ముందే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంజయ్య మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. రామారావు కు అల్లుడు ఆయిన తరువాత తెలుగుదేశం లో చేరి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసి ఇప్పుడు మంత్రిగా భాద్యతలు చేపట్టారు. ఎన్టీ రామారావు మనవడిగా ఈయనకు కూడా సినిమా పరిశ్రమతో అనుబంధం ఉన్నట్టే. అంతే కాదు రామారావు కొడుకు ప్రముఖ నటుడు బాలకృష్ణ కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే తెలుగుదేశం పార్టీలో సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారు ముగ్గురు ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు దగ్గుబాటి పురందేశ్వరి. రాజకీయ ప్రవేశం చేసినప్పుడు అప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీ కి దూరమయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. కేంద్ర మంత్రి వర్గంలో భాద్యతలు నిర్వహించారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. పార్టీ ఆమెను ఏపీ అధ్యక్షురాలిగా నియమించింది. కూటమి ఏర్పడటం, విజయం సాధించి అధికారంలోకి రావడంలో ఆమె పాత్ర కూడా ఉంది. పురందేశ్వరి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు కావడం విశేషం. అంటే బీజేపీ లో కూడా సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్నవారు ఉన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. జనసేన అధినేత. సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ప్రముఖ నటుడు, నాయకుడు. ఐదేళ్ల పాటు జగన్ ను ఓడించడానికే కంకణం కట్టుకున్నారు. ఐదేళ్లు పరిశ్రమకు దూరంగా ఉండి, వైసీపీ ని ఇంటికి పంపడానికి అయన కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. విజయం సాధించారు. ఆయన పార్టీ అభ్యర్థుల గెలుపు తో పాటు కూటమి అభ్యర్థులు గెలుపు కోసం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు అందరు దాదాపుగా విస్తృత ప్రచారం చేశారు. విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. జనసేన పార్టీ లో కూడా సినీ పరిశ్రమతో బంధం ఉన్నవారు ఉన్నారు. మొత్తానికి కూటమిలో ఉన్న ప్రధాన నాయకులకు, సినిమా పరిశ్రమతో అనుబంధం ఉండటం విశేషం.