BRS KCR : భారత రాష్ట్ర సమితి పార్టీ పరిస్థితి ప్రస్తుతం కుడితిలో పడ్డ ఎలుకల తయారైనది. అధినేత భాద్యతగా వహించి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అంపశయ్య మీద ఉన్న పార్టీకి చికిత్స చేయక తప్పడంలేదు. చికిత్స మొదలు పెట్టకపొతే పార్టీ పరిస్థితి మరింత అద్వాన్నస్థితిలోకి వెళ్లక తప్పదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఏది మాట్లాడినా నాయకులకు వేదమైనది. అధికారం కోల్పోగానే ఆయన వెంట నడిచేందుకు కొందరు ముందుకు రావడంలేదు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను అధినేత కేసీఆర్ కాపాడుకోవాల్సిన భాద్యత ఎంతో ఉంది.
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రస్తుతం కష్టకాలమే ఉంది. ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులు ఒక్కరు కూడా విజయం సాదించలేకపోయారు. పార్టీ పరిస్థితిని ఒక్కసారి సమీక్షించిన నేపథ్యంలో మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు మెజార్టీ సాధించారు. 8 పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్ ను సైతం దక్కించుకోలేక పోవడం విశేషం. ఈ విషయాన్ని ఎవరైనా చెబితే వినడానికి కొంత ఇబ్బందిగా ఉన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ పార్టీ తన స్థానాల్లో కొంత పరిస్థితి మారినప్పటికీ 64 అసెంబ్లీ స్థానాల్లో మాత్రం తన పూర్వ వైభవాన్ని చాటుకోవడం విశేషం. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని 45 అసెంబ్లీ స్థానాల్లోఆధిక్యాన్ని చాటుకొని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు సవాల్ విసిరింది. మజ్లీస్ మాత్రం తన ఒక్క పార్లమెంట్ స్థానాన్ని నిలుపుకొంది.
గులాబీ శ్రేణులు కాషాయం అభ్యర్థులకు సహకారం అందించారని ముందు నుంచి విమర్శలు రాష్ట్రంలో ఉన్నాయి. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర పెద్దలకు అంతర్గతంగా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడిందో లేదో తెలియదు. కానీ సంకేతాలు పంపడంతోనే ఓట్లు బీజేపీ కి అనుకూలంగా వెళ్లాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు బిఆర్ఎస్ కు వస్తే బిఆర్ఎస్, బీజేపీ కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ తో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని కేసీఆర్ ఆశ పడ్డారు. కానీ ఆ ఆశలు అడియాసలు అయ్యాయి.
గులాబీ అభ్యర్థులు ఎక్కడ కూడా మెజార్టీ సాధించలేదు. బీజేపీ మాత్రం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ కూడా సమానంగానే విజయాన్ని దక్కించుకొంది. తాజాగా కేంద్రంలో బీజేపీ సొంతంగా 400 స్థానాల్లో విజయం సాదిస్తుందని బీజేపీ శ్రేణులు రాష్ట్రంలో నమ్మారు. మిత్రులతో సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ కూడా బలోపేతం అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నం చేసే అవకాశాలు తక్కువే అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
తమ రాజకీయ భవిష్యత్తు కోసం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు కూడా కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా రాలేదని వివరించారు. రాజకీయ భవిష్యత్తు తోపాటు మనుగడ సాధించడానికి కాంగ్రెస్ లోకి వస్తే తప్పులేదని దానం నాగేందర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. బీజేపీ లోకి వెళితే మంచి భవిష్యత్తు ఉంటది అని ఎవరైనా అంటే దానికి కూడా దానం వివరణ ఇచ్చారు. అయోధ్య లోకసభ నియోజకవర్గం లో పార్టీ అభ్యర్థి ఓటమి చెందారు. అదేవిదంగా గత ఎన్నికల్లో మోదీ 5 లక్షల పైగా మెజర్టీ సాధిస్తే, ఇటీవలి ఎన్నికల్లో లక్షకు పైగా మెజార్టీ సాధించడం జరిగిందని వివరించారు. బీజేపీ గ్రాఫ్ తగ్గుముఖం పడుతున్న క్రమంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నది కాబట్టి కాంగ్రెస్ లో చేరి ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుతున్నానని దానం నాగేందర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తట్టుకోవడం కష్టమే. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కుడితిలో పడ్డ ఎలుకలా పార్టీ పరిస్థితి నెలకొంది. రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో బలంగానే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలను ఎలా నమిలి మింగాలో మోదీ, అమిత్ షా , నడ్డాలకు వెన్నతో పెట్టిన విద్య. అదేవిదంగా పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ తో కేసీఆర్ ఎలా ఆడుకున్నాడో రేవంత్ రెడ్డి ఇంకా మరచి పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఎలా కాపాడుకోవాలో అనే ఆలోచనలో పడ్డారు కేసీఆర్. ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపిన నాయకుడు. తెలివితేటలకు తక్కువ ఉన్న వ్యక్తి అసలే కాదు. ఉన్న ఎమ్మెల్యేలను రాబోయే ఐదేళ్ల పాటు కాపాడుకుంటూ, పార్టీ శ్రేణులు చేజారకుండా ఉండేందుకు కేసీఆర్ వద్ద ఏ మంత్ర దండం ఉందొ అనేది క్యాడర్ కు అర్థం కావడం లేదు.