CM Revanth Reddy : మంది ప్రజానీకానికి నీడనిస్తున్న నగరం హైదరాబాద్. రెండు తెలుగు రాష్ట్రాల కుటుంబాలకు అండగా నిలిచిన భాగ్యనగరం. ఈ నగరం ఎంత ఆరోగ్యముగా ఉంటె ప్రజలు కూడా అంత ఆనందంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఈ నగరంలోనే సేదతీర్చుకుంటున్నారు. ఈ విశాలమైన నగరంలో ఉంటున్న వారికి చరిత్ర అవసరంలేదు. వారికి ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకుంటారు.
కానీ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి బరువు ఎత్తుకున్నారు. నవ నిర్మాత కాబోతున్నారు. సీఎం కు తెలుసు , ఈ ఆ పని అంత సులువైనది, తేలికైనది కాదని.. ముళ్ల బాటేనని కూడా తెలుసు. అయినప్పటికి సురక్షిత హైదరాబాద్ కోసం ఒక మహా యజ్ఞమునే ప్రారంభించారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు చూపిస్తున్న పట్టుదలే ఒక యజ్ఞం కావాలి. ఆ యజ్ఞం పూర్తయ్యేదాకా పట్టుదలతో ఉండాలి, అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది.
సీఎం గా భాద్యతలు చేపట్టిన నాటి నుంచే హైదరాబాద్ అభివృద్ధి పై దృష్టి సారించారు. మూసీ నదికి సుందరీకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్ నలుదిక్కులకు మెట్రో రైలు వెళ్ళడానికి ప్రణాళికలు తయారవుతున్నాయి. ఫోర్త్ సిటీ కూడా సిద్ధమవుతోంది. ఎంత అభివృద్ధి చేసినప్పటికీ ఆయన తరువాత వచ్చిన సీఎం ఈ అభివృద్ధి తామే చేశామని చెప్పుకుంటారు. అవసరమైతే చేసిన పనులకు పేర్లు మార్చివేస్తారు. హైడ్రా విజయవంతం చేయడానికి నిబంధనలు కఠినంగా అమలుచేసే అధికారి రంగనాథ్ ను నియమించారు. రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయం. రంగనాథ్ అంటేనే నిద్రలో కూడా కబ్జా దారులు ఉలిక్కిపడుతున్నారు.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభం అయిన నాటి నుంచే కబ్జా అనే రోగం కొందరికి సోకింది. హైడ్రా ఏర్పడగానే 44 ఏళ్ల కిందట ఎన్ని చెరువులు ఉండేవి, వాటి వైశాల్యం ఎంత అనే గణాంకాలను సేకరించారు. గణాంకాల ప్రకారం 60 నుంచి 100 శాతం వరకు చెరువులు స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లాయి. మొదటి దశలో భాగంగా చెరువుల్లోని అక్రమ కట్టడాలను అడ్డుకోవడం హైడ్రా లక్ష్యం. రెండో దశలో భవనాలు నిర్మించిన వారి నిర్మాణాలను నిలిపివేయడం. మూడో దశలో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునరుజ్జీవం కల్పించడం ప్రధాన లక్ష్యం. . రంగనాథ్ లక్ష్యాలు ఎంతో ఉన్నతంగా ఉన్నవి. అందుకే ప్రజలు సంపూర్ణంగా మద్దతు పలుకుతూ అండగా నిలుస్తున్నారు.
వాస్తవిక దృక్పథంతో హైడ్రా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పదిహేను.. ఇరవై ఏళ్ల కిందట కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు అక్రమ కట్టడాలు అని కూల్చివేస్తమంటే ఎలా అని హైకోర్టు సైతం ప్రశ్నించింది. ఇన్నేళ్ల పాటు ఎవరూ పట్టించుకోకుండా.. ఇప్పుడు ఒక్క సారే వచ్చి కూల్చేస్తామంటే అది న్యాయ సమ్మతం కూడా కాదని హై కోర్ట్ స్పష్టం చేసింది. గత పదేళ్ల కాలాన్ని లక్ష్యముగా చేసుకొని. బఫర్ జోన్లు.. శిఖం భూములన్నిటిని క్లియర్ చేస్తే చాలా వరకూ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కుటుంబీకులు బాధితులు అయినా సరే… వదిలి పెట్టకుండా ముందుకు సాగితే…సీఎం అనుకున్న లక్ష్యం నెరవేరడం ఖాయం.
సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా మమ అనే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ముందుగా బుల్ డోజర్లు వస్తాయి. వాటి వెనుక నాయకులు వస్తారు. ఇంకేముంది ఆ తరువాత అందరు రాజీపడిపోతారు. ఇది నిన్నటి వరకు జరిగిన జగమెరిగిన సత్యం. కానీ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో ప్రజలు మాత్రం ఎదో ఆశిస్తున్నారు. ఆయన ఎదో చేయాలనీ కూడా తపన పడుతున్నారనేది ప్రజలకు కనబడుతోంది. అభివృద్ధి చేయకపోయినా పరవాలేదు. వర్షం నీరు మా ఇళ్లలోకి రాకుండా చేస్తే అదే పదివేలు అంటున్నారు భాగ్యనగరం భాగ్యవంతులు.