Home » సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలి

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలి

2013 నుంచి ఉన్న బకాయిలను చెల్లించాలి
కేంద్ర మంత్రికి ఎస్సీసీకేఐఎస్-సిటియు వినతి

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియాలో అమలులో ఉన్న హైపవర్ కమిటీ వేతనాలను వెంటనే అమలు చేయడంతో పాటు, 2013 నుంచి రావాల్సిన బకాయిలు (ఏరియర్స్) చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సీసీకేఐఎస్-సిటియు ఆధ్వర్యంలోని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేసింది.సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్పీ-3ని మంగళవారం సందర్శించిన సందర్భంగా సంఘం నాయకులు ఆయనకు మెమోరాండం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్సీసీకేఐఎస్-సిటియు బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు గట్టు మహేందర్, కార్యదర్శి దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ.. కోల్ ఇండియాలో 2013లో కుదిరిన ఒప్పందం మేరకు కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తున్నప్పటికీ, తెలంగాణలోని సింగరేణి సంస్థలో మాత్రం ఇప్పటికీ అమలు చేయకపోవడం వల్ల కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు.

హైపవర్ కమిటీ వేతనాలు అమలు కాకపోవడంతో ఒక్కో కాంట్రాక్టు కార్మికుడు నెలకు సుమారు రూ.19 వేల వరకు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. సింగరేణిలో సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, వారి జీవనోపాధికి భరోసా కల్పించేందుకు హైపవర్ కమిటీ వేతనాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. అలాగే 2013 నుంచి రావాల్సిన బకాయిలను కూడా కార్మికులకు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీసీకేఐఎస్-సిటియు శ్రీరాంపూర్ డివిజన్ కార్యదర్శి కాసీపేట రాజేశం, గుజ్జేటి రమేష్, తలారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *