గోదావరిఖనిలో అరుణోదయ రామారావు వర్ధంతి
ప్రజా కళల కోసం పోరాటం కొనసాగిస్తాం
గోదావరిఖని, కోల్ బెల్ట్ న్యూస్:
అరుణోదయ రామారావు ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బతుకుల రాజన్న తెలిపారు. రామారావు 7వ వర్ధంతి సందర్భంగా గోదావరిఖని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో అరుణోదయ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బతుకుల రాజన్న మాట్లాడుతూ, రాళ్లను కరిగించే రాగాలతో, రాజ్యాన్ని కబళించే గానంతో ప్రజల మధ్య వర్గపోరాట స్పూర్తిని నింపిన రామారావు జీవితాన్ని స్మరించుకున్నారు. ప్రజల కష్టాల నుంచి పుట్టిన ప్రజా కళలు, శ్రమ దోపిడీ లేని సమాజ నిర్మాణానికి సాధనంగా ఉంటాయని పేర్కొన్నారు.
దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా కళాకారుల గొంతుకలను అణచివేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు కాలేదని విమర్శించారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు, బ్లాక్ మనీ వెలికితీత, జనధన్ ఖాతాల్లో డబ్బుల జమ, ‘బేటీ బచావో బేటీ పడావో’, రైతు సంక్షేమం వంటి హామీలు నెరవేరలేదని అన్నారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగంలోని లౌకిక విధానాలు, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని, ప్రశ్నించే స్వరాలను అణచివేస్తోందని ఆరోపించారు. కళ ప్రజల కోసం ఉండాలని భావించిన రామారావు తన జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేశారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ. కృష్ణ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఈ. నరేష్, ఐ. రాజేశం, జీ. మల్లేశం, అరుణోదయ జిల్లా సహాయ కార్యదర్శి జనగామ బానేష్, ఐఎఫ్‌టీయూ నాయకులు ఎం. కొమరయ్య, రాఘవాచారి, సంతోష్, అఫ్జల్, గంధం శ్రీనివాస్, వెంకటేష్, పోగుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

by