Home » Harish Rao : ఆ ఇద్దరితో ఆయనకు ఇబ్బందేనా ?

Harish Rao : ఆ ఇద్దరితో ఆయనకు ఇబ్బందేనా ?

Harish Rao : రాజకీయ ఎన్నికల వాతావరణం అంతా కూడా గెలుపు, ఓటమిలపై ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రత్యర్థి తప్పనిసరి. అయితే సిద్ధిపేట నియోజకవర్గంలో మాత్రం రాజకీయ ఎన్నికల వేడి అప్పుడే వేడెక్కింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో హరీష్ రావును ఓడించి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామంటూ ప్రకటించారు. అదే విధంగా జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా తన ప్రత్యర్థి హరీష్ రావేనని, సిద్దిపేట నుంచి తానూ బరిలో ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. కవిత ఇంటిపోరుతో, అధికార పార్టీ బయటి పోరుతో హరీష్ రావుకు రాబోయే ఎన్నికల్లో ఇబ్బంది తప్పదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు ఆమోదమయి, సిద్ధిపేట స్థానం మహిళలకు కేటాయిస్తే కవిత అక్కడి నుంచే పోటీలో ఉంటారు. ఒకవేళ జనరల్ స్థానం అయినా ఆమెనే పోటీ చేస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బీసీ లకు దక్కితే కూడా కవిత తన అభ్యర్థిని బరిలో ఉంచడం ఖాయం. కవిత లేదా తన పార్టీ అభ్యర్థి ఎవరు బరిలో నిలిచినా గులాబీ పార్టీలో చీలిక రావడం ఖాయమంటున్నారు రాజకీయ శ్రేణులు. ఈ నేపథ్యంలో హరీష్ రావు రాజకీయ ఇబ్బందులు తప్పవంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడానికంటే ముందుగానే సిద్దిపేట నుంచి పోటీ చేయడం ఖాయమంటూ ఆమె ప్రకటించడం విశేషం.

ఇది ఇలా ఉండగా బిఆర్ఎస్ పార్టీకి మూల స్థంభమైన హరీష్ రావ్ ను సిద్దిపేట లో ఓడిస్తే బిఆర్ఎస్ కు రాజకీయ కరువుబి ఏర్పడుతుంది. అందుకే అక్కడి కాంగ్రెస్ నాయకులకు ముందుగానే మంత్రి పదవిని బహుమానంగా ప్రకటించారు. సిద్దిపేట నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా హరీష్ రావు, జాగృతి నుంచి కవిత, బీజేపీ అభ్యర్థిగా గట్టి అభ్యర్థి బరిలో ఉంటారు. కవిత బరిలో ఉండటంతో గులాబీ ఓట్లు చీలి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సులువవుతుందనే ఆలోచనతోనే సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు మంత్రి పదవి బహుమతిని ప్రకటించారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో కానీ రాబోయే ఎన్నికల్లో మాత్రం హరీష్ రావ్ కు ఒకవైపు ఇంటి నుంచి, మరోవైపు బయటి నుంచి రాజకీయ ఇబ్బంది తప్పదనే అభిప్రాయాలు రాజకీయ శ్రేణుల నుంచి వ్యక్తం కావడం విశేషం.
———————————
సీనియర్ జర్నలిస్ట్
సిహెచ్ పరశురామ్
9603505050
——————————–

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *