TRASMA : మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలను అకారణంగా పలు విద్యార్ధి సంఘాల నాయకులు వేదిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్, రామగుండం పోలీస్ కమిషనర్ కు మంచిర్యాల జిల్లా ట్రస్మా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామెర్ల సిద్దయ్య, ఏనుగు శ్రీకాంత్ రెడ్డి, పలువురు కరస్పాండెంట్లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…..
చిన్న, చిన్న కారణాలు చూపుతూ విద్యార్ధి సంఘాల నాయకులు వేధిస్తున్నారని ఆరోపించారు. నేరుగా విద్యాసంస్థల్లోకి వచ్చి తనిఖీలు చేస్తున్నారని, నిబంధనలకు విరుద్దంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారంటూ వేధిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ నిబంధనలు అమలుచేస్తూ సంస్థలను నడిపిస్తున్న నేపథ్యంలో పలు సంఘాల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎలాంటి సహాయం కోరకుండా మామూలు రుసుము వసూలు చేస్తున్న మమ్మల్ని వేధించడం సరికాదన్నారు.
జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీ విషయం కోర్టులో ఉండగా తామెలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. మా నిబంధనల గురించి విద్యార్ధి సంఘాల నాయకులు ప్రశ్నించడంతో తప్పులేదు. కానీ సంఘాల నాయకులు ఏ మేరకు నిబంధనలను అమలు చేస్తున్నారో తెలుపాలని ట్రస్మా నాయకులు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.