Mlc Kavitha : ఎమ్మెల్సీ కవిత…. ఉద్యమ నాయకురాలు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు. బిఆర్ఎస్ నాయకురాలు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇటీవల రాజకీయ పరంగా కావచ్చు లేదంటే కుటుంబ పరంగా కావచ్చు ఎదో ఒక రకంగా ఆమె పార్టీకి,కుటుంబానికి దూర మైనారు. ఇటీవల కేసీఆర్ ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో ఆమె కూడా ఇంటికి వెళ్లారు. కేసీఆర్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇంటికి వెళ్లి చెప్పలేదు. ఎదో మమ అనిపించారు కవిత. మొత్తానికి ఆమె కుటుంబానికి, పార్టీకి దూరమవుతానని ముందే పసిగట్టి, రాజకీయంగా దూకుడు పెంచారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగా కవిత సొంతంగా రాజకీయ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.
శనివారం జాగృతి కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. కొంపల్లిలో శ్రీ కన్వెన్షన్ లో రెండు విభాగాలుగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరానికి ‘‘లీడర్’’ నాయకత్వ శిక్షణ అని పేరు పెట్టారు. 119 నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన వారు శిక్షణలో పాల్గొన్నారు. శిక్షణ ముగింపు రోజు కవిత కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గ్రామ పంచాయితీ నుంచి మొదలుకొని పార్లమెంట్ వరకు భాద్యతలు, నిబంధనల గురించి నిష్ణాతులచే తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
కవిత మాత్రం యువత పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. కవిత రాజకీయ శిక్షణ తరగతులకు యువత వెళ్లకుండా ఉండేందుకు బిఆర్ఎస్ కూడా విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో నాచారంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కొసమెరుపు. ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న నేపథ్యంలో ఎవరిదీ పై చేయి అవుతుందో వేచి చూడాలంటున్నారు రాజకీయ శ్రేణులు.