సీటీయూ మంచిర్యాల జిల్లా కమిటీ డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల):
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలను తగ్గించేలా జారీ చేసిన జీవోలను వెంటనే సవరించాలని సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (CTU) మంచిర్యాల జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అలాగే ఉద్యోగ, కార్మిక వర్గానికి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు గట్టు మహేందర్ అధ్యక్షతన సీటీయూ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల హక్కులు బలహీనపడటంతో పాటు యాజమాన్యాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్స్‌ను రాష్ట్రంలో అమలు చేయకుండా తిప్పికొట్టాలని వారు కోరారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వర్గానికి ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని నాయకులు విమర్శించారు. ఇటీవల జారీ చేసిన జీవోల కారణంగా ప్రస్తుతం పొందుతున్న వేతనాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ, వాటిని వెంటనే సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచుతూ కొత్త జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు లేని సింగరేణి కాంట్రాక్టు కార్మికులు, అంగన్‌వాడీ, ఆశా, ఐకేపీ, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది, మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులు, హమాలీలు, అసంఘటిత రంగ కార్మికులతో పాటు అన్ని రంగాల కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీటీయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంకె రవి, జిల్లా అధ్యక్షుడు గట్టు మహేందర్, జిల్లా కార్యదర్శి దూలం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కాసిపేట రాజేష్, గంట రాజేంద్ర ప్రసాద్, సహాయ కార్యదర్శులు రాతిపెల్లి నగేష్, కోలా వాసు తదితరులు పాల్గొన్నారు.

by