సింగరేణిలో పెరుగనున్న ఉత్పత్తి
కొత్తగా ఉపాధి అవకాశాలు
కోల్ బెల్ట్ న్యూస్(సింగరేణి ప్రతినిధి):
తెలంగాణకు కీలకమైన తాడిచెర్ల-2 బొగ్గు గనిని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు కేటాయించేందుకు ప్రధాన మంత్రి అంగీకరించినట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థకు కొత్త ఊపు లభించడంతో పాటు రాష్ట్ర బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉంది.ఇటీవల సింగరేణికి కొత్త బొగ్గు గనుల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది. ఈ నేపథ్యంలో తాడిచెర్ల-2 గనిని సింగరేణికి అప్పగించే అంశంపై ప్రధాన మంత్రి అంగీకారం తెలిపారు.
తాడిచెర్ల-2 గని సింగరేణికి లభిస్తే సంస్థ బొగ్గు నిల్వలు పెరగడంతో పాటు భవిష్యత్ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడంలో కీలకంగా మారనుంది. కొత్త గని ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు స్థానిక ప్రాంతాల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.ఇటీవలి కాలంలో కొన్ని పాత గనులు మూతపడుతున్న నేపథ్యంలో కొత్త బొగ్గు గనుల కేటాయింపు సింగరేణి భవిష్యత్తుకు అత్యంత అవసరంగా మారింది. తాడిచెర్ల-2 గని ఆమోదంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ విద్యుత్ అవసరాలకు కూడా ఇది బలమైన పునాదిగా నిలుస్తుందని కార్మికవర్గాలు అభిప్రాయపడుతున్నారు.
అయితే తాడిచెర్ల-2 గని కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఉత్తర్వులు జారీ అయిన తర్వాత గని అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పత్తి ప్రారంభానికి సంబంధించిన ప్రక్రియలను యాజమాన్యం వేగవంతం చేయనుంది.

by